– ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికే మా మద్దతు
– కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి తెదేపా మద్దతివ్వాలి
– మీడియాతో వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి
సంతరావూరు : ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదానే రాష్ట్రాభివృద్దికి సంజీవని అన్న చంద్రబాబు అధికారానికి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని అసెంబ్లీలో వ్యాఖ్యానించారని వైసిపి అధినేత వైఎస్ జగన్ అన్నారు. నిన్న(బుధవారం) అరుణ్ జైట్లీ చెప్పిందాంట్లో కొత్తదనం ఏమీ లేదన్నారు. నెపాన్ని కేంద్రంపై నెట్టాలన్న దురాశతో టిడిపి కేంద్ర మంత్రి పదవులు వదులుకుంటున్నట్లు ప్రకటించారని జగన్ విమర్శించారు. జైట్లీ తొలి ప్రకటన చేసినప్పుడే రాజీనామాలు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన గురువారం ఉదయం సంతరావూరు గ్రామంలో మీడియాతో మాట్లాడారు.
‘ప్రజల నుండి వస్తున్న ఒత్తిడి వల్లే చంద్రబాబు దిగొచ్చారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైసిపి సిద్ధమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు తలొగ్గాల్సి వచ్చింది. స్వాతంత్య్ర పోరాటం చివరి దశలో ఉన్న సమయంలో బ్రిటీష్ వారు భారత్‌కు మేమే స్వాతంత్య్ర ఇస్తున్నాం’ అని ప్రకటించారు. చంద్రబాబు వైఖరి కూడా అలాగే ఉంది. చంద్రబాబు ఇప్పటికైనా ప్రజా ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం అభినందనీయం. రాజీనామాలు చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు ప్రధానితో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కేంద్రం నుండి వైదొలిగినా ఎన్డీయేలో ఇంకా కొనసాగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత, చిత్తశుద్ధి చాలా అవసరం. చంద్రబాబుకు ఇవేమీ లేవు కాబట్టే రోజుకో మాట మాట్లాడుతున్నారు. మన ఏం చేసినా ప్రజలు అలా పడి ఉంటారులే అనుకుంటున్న ఆయన (చంద్రబాబు) పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చింది. చంద్రబాబుకు సమయం ఇచ్చేందుకే ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు ప్రకటించాం. అంతకుముందే తీర్మానం పెట్టడానికైనా మేం సిద్ధమే. ఒకవేళ టిడిపినే తీర్మానం పెట్టినా మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. 21న రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు రాజీనామా చేద్దాం. అప్పుడు దేశం మొత్తం చర్చనీయాంశం అవుతుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగిరాక మానదు’ అని జగన్ అన్నారు.
‘14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని అరుణ జైట్లీ గతంలోనూ ఎన్నోసార్లు చెప్పారు. 14వ సంఘం 2013లోనే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటైంది. 2015, ఏప్రిల్ 1 నుండి అది అమల్లోకి వచ్చింది. ప్రత్యేక హోదాపై 2014 మార్చి 2న అప్పటి యూపీఏ కేబినెట్ తీర్మానం చేసింది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక కూడా ఏడు నెలల పాటు ప్రణాళిక సంఘం పనిచేసింది. అప్పుడు చంద్రబాబునాయుడు ఎందుకు పట్టించుకోలేదు. ఏడు నెలల పాటు ఫైలు కదలిక లేకున్నా ఏం చేశారు? చంద్రబాబు మాటలు వింటుంటే ఆయన అసలు ముఖ్యమంత్రేనా అన్న సందేహం కలుగుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని అరుణ్ జైట్లీ తొలిసారి ప్రకటన చేసినప్పడే చంద్రబాబు స్పందించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఎన్నికలు ఏడాది ఉన్న సమయంలో కేంద్రం నుండి వైదొలగుతామని ప్రకటిస్తారు. కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేస్తారు. ఎన్డీయేలో మాత్రం కొనసాగుతారు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల అంశంలో కేంద్రం చెప్పే కారణాలు సరికాదు. మీకిస్తే మిగతా రాష్ట్రాలు అడుగుతాయని చెప్పడం విడ్డూరంగా ఉంది. విభజనకు కాంగ్రెస్, బిజెపితో పాటు చంద్రబాబూ కారణమే. రాష్ట్రాన్ని విడగొట్టద్దు అని నిలబడ్డ ఏకైక పార్టీ వైసిపినే. తెలంగాణలో నష్టం జరుగుతుందని తెలిసినా ధైర్యంగా నిలబడ్డాం. చంద్రబాబు ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించాలని కోరుతున్నా. ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో హోదా సాధించలేని నెపాన్ని ఎవరో ఒకరిపై నెట్టేసి పబ్బం గడుపుకుందామంటే కుదరదు. అమరావతికి మోదీ వస్తున్న సమయంలో ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేస్తే రాత్రికి రాత్రి పోలీసులతో ఖాళీ చేయించేశారు. బంద్‌లు చేస్తే దగ్గర ఉండి నిర్వీర్యం చేశారు. ఇక ఆయనకు చిత్తశుద్ధి ఎక్కడిది? ఎవరికి మద్దతివ్వాలన్న విషయంపై వైసిపి పూర్తి స్పష్టతతో ఉంది. ప్రత్యేక హోదాకు కేంద్రంలో ఎవరు మద్దతిస్తే వారికి మేం మద్దతిస్తాం. ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో బిజెపికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు’ అని జగన్ తేల్చి చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు.