హైదరాబాద్ : హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఊరట నిస్తున్నాయి. ఏకీకృత ఆదేశాలను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమలులోకి తీసుకొచ్చింది. దీనిపై ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. కోర్టలో ఉపాధ్యాయ సంఘాల వాదనకు అనుకూలంగా తీర్పు వెలువడటంతో కొంత ఊరట నిచ్చినట్లయ్యింది. ప్రభుత్వ, పంచాయితీరాజ్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఒకే సర్వీస్ నిబంధనలను 2017లో అమలులోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని హైకోర్టు తేల్చింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉపాధ్యాయుల ఏకీకృత నిబంధనలను సవాల్ చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పంచాయితీరాజ్ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా బదిలీలు, పదోన్నతులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఉపాద్యాయులందరికీ ఒకే సర్వీసు నిబంధన అమలు చేయాలని చాలా కాలంగా డిమాండు చేస్తున్నారు. వీరి డిమాండ్‌పై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులందరినీ ఒకే సర్వీస్ నిబంధనల పరిధికి తెస్తూ 2017 జూన్ 23న ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చింది.
ఈ ఉత్తర్వులను ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం సవాల్ చేసింది. హైకోర్టును ఆశ్రయించి కేసు వేశారు. ఉపాధ్యాయ నియామకం సమయంలోనే పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేర్వేరు నిబంధనలు ఉంటాయని పిటిషన్‌లో వివరించింది. లక్షల సంఖ్యలో ఉండే పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలపటం ద్వారా తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం హైకోర్టులో వాదన వినిపించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత మంగళవారం ఏకీకృత సర్వీస్ నిబంధనలను కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఇకపై పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయులకు వారి వారి నిబందనల మేరకే బదిలీలు, పదోన్నతులు జరగనున్నాయి.