Home జాతీయం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి – ఉపాధ్యాయ దినోత్సవం

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి – ఉపాధ్యాయ దినోత్సవం

2048
0

విద్యా విభాగం : రాధాకృష్ణన్ ది చాలాపేద కుటుంబం. ఉన్నత విద్య చదివించే స్తోమత లేదని తండ్రి వీరాస్వామి కొడుకును పూజారిగా చేయమన్నారు. కానీ రాధాకృష్ణన్‌కు చదువంటే ప్రాణం. అందుకే ఉన్నత పాఠశాల చదువుకోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరారు. ఇక అప్పటినుంచీ ఈయన చదువంతా ఉపకార వేతనాలతోనే సాగిపోయింది. భోజనం చేసేందుకు అరిటాకు కూడా కొనలేని పరిస్థితుల్లో ఆయన నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎమ్మే పూర్తిచేసిన రాధాకృష్ణన్ ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరారు. ఆయన పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. ఆయన రోజులో 12గంటలపాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాసేవారు. రాధాకృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పదవులు చేపట్టడమే కాదు, ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి (వైస్‌ఛాన్స్‌లర్) గా పనిచేశారు. రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు.

ఆయన రాసిన ‘ఇండియన్ ఫిలాసఫీ’ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేక ఆహ్వానంపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించారు. ‘యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్’లో సభ్యుడిగా ఉండి మన విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. రాధాకృష్ణన్1952లో మన మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారత రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు చేపట్టారు. 1954లో భారతరత్న పురస్కారం దక్కింది. అయినా ఏనాడూ ఆడంబరాలకు పోలేదు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం 25శాతం తీసుకుని మిగతాది ప్రధాన మంత్రి సహాయ నిధికి తిరిగిచ్చేవారు.

రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. ఆయన మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్‌గా వెళ్లేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి తమ గురువును కూర్చోబెట్టి రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట. రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు, అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా, దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని ఆయన కోరారట. ఆరోజు నుంచే ఆయన పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.