జగిత్యాల : ఇద్దరు పదోతరగతి విద్యార్ధులు పెట్రోలు మంటల్లో కాలి ప్రాణాలొదిలిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇద్దరూ ఒకే స్కూల్‌లో ఒకే తరగతి చదువడమే కాదు… ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారట. అదే విషయంలో ఆ ఇద్దరి మధ్య స్నేహం చెడింది. ప్రేమ విషయంలో.. నువ్వు తప్పుకో… కాదు.. నువ్వే తప్పుకో అంటూ గొడవకు దిగారా…! అదేవివాదం వారిద్దరి ప్రాణం మీదకు తెచ్చింది. తాగిన మైకంలో ఒకరిపై మరొకరు పెట్రోలు చల్లుకొని.. నిప్పంటించుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం విజయపురికాలనీలో ఘటన చోటు చేసుకుంది. విజయపురిలో నివాసం ఉంటున్న కూసరి మహేందర్, విద్యానగర్‌కు చెందిన కుందారపు రవితేజ ఇద్దరూ స్నేహితులు. విద్యానగర్‌లోని ఓ స్కూల్లో పదోతరగతి చదువు కుంటున్నారు. మహేందర్ గతంలో ఒకసారి ఇల్లు వదిలి హైదరాబాద్‌కు పారిపోయాడు. రవితేజ మత్తు కోసం వుడ్ ప్రైమర్ తాగడం అలవాటు చేసుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు అతడికి పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పించారు.
ఈ క్రమంలో మహేందర్, రవితేజ ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఆ విషయంలో తరచూ ఇద్దరూ గొడవ పడుతుండేవారు. మహేందర్, రవితేజ మరో స్నేహితుడితో కలిసి ఆదివారం పట్టణంలోని మిషన్ కాంపౌండ్‌కు వెళ్లారు. అక్కడ తాగిన మైకంలోఇద్దరూ గొడవ పడినట్లు సమాచారం. గొడవ ముదరడంతో ఒకరిపైన మరొకరు పెట్రోలు చల్లుకొని నిప్పంటించుకోవడంతో వారి స్నేహితుడు అక్కడి నుండి పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మంటల్లో మహేందర్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. రవితేజను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అయితే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరూ ఒకరిపై మరొకరు పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నారా? లేక ఈ ఘటనలో మూడో వ్యక్తి ప్రమేయం ఉందా? అదీకాకుంటే అమ్మాయిని వేధిస్తున్నారనే కారణంతో మరెవరైనా ఘాతుకానికి ఒడికట్టారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటన సమయంలో అక్కడున్న వారి మిత్రుడు పాయిపోయి ఎక్కడున్నాడో ఆచూకీ తెలియలేదు. అతన్ని పట్టుకుంటే.. ఘటనపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.