ఒంగోలు : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ సభ ఒంగోలులోని ఎంఎస్ ఫంక్షన్ హాలులో బుధవారం నిర్వహించారు. సభలో ఉపాధ్యాయ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రమణ్యం, సంయుక్త కలెక్టర్ మాలకొండేయులు, జిల్లా విద్యాశాఖాధికారి విఎస్ఎస్ సుబ్బారావు చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులు అవార్డులు అందుకున్నారు.
ఈసందర్భంగా ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడారు. మార్కులే పరమావధిగా ప్రవేటు సెక్టార్‌లో విద్యాబోధన చేస్తున్నరోజుల్లో విద్యార్ధులను మార్కులతోపాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగిస్తు బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయులపై ఉందని చెప్పారు. విద్యార్ధులు లేరనే పేరుతో పాఠశాలలు మూసివేతకు ప్రభుత్వం సిద్దమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యావ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉపాధ్యాయుడు బాధ్యతా యుతంగా పనిచేస్తే ప్రవేటు పాఠశాలలకు ధీటుగా అన్ని రంగాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు అభివృద్ది అవుతారని చెప్పారు. ఉపాధ్యాయులంటే కేవలం పాఠాలు బోధించడమే కాకుండా విద్యార్ధికి సమాజిక అంశాలపై అవగాహన కల్పించడం, ఆధునిక సాంకేతికతను విద్యార్ధులకు పరిచయం చేసే నిరంతర విద్యార్ధిగా కూడా కొత్త అంశాలు నేర్చుకోవాలని చెప్పారు.