డిల్లీ : బండ్ల గణేష్… ఈ పెరు తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు. అతనో ప్రముఖ సినీ నిర్మాత. తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, టిఆర్ఎస్‌కు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇతర నేతల సమక్షంలో చేరారు.
ఈసందర్భంగా బండ్ల గణేశ్ మీడియాతో మాట్లాడారు. దేశం కోసం కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసిందన్నారు. కాంగ్రెస్ అంటే తనకు ఇష్టం కాబట్టే ఆ పార్టీలో చేరానన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు. రాహుల్‌గాంధీ కోరితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. లేకుంటే కాంగ్రెస్ అభ్యర్ధుల కోసం ప్రచారం మాత్రమే చేస్తానని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ టిక్కెట్ కోరుతున్నట్లు తనపై వస్తున్న వార్తల్లో వాస్తవంలేదన్నారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుటే ఆ నిర్ణయానికే కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. పవన్‌కల్యాణ్ తనకు గురువైనప్పటికీ చిన్నతనం నుండి కాంగ్రెస్‌పై తనకున్న ఇష్టంతోనే కాంగ్రెస్‌లో చేరుతున్నానన్నారు. ఎమ్మెల్యేగా ప్రజాజీవితంలోకి రావాలన్నది తన కోరికగా గణేష్ చెప్పారు.
జనంకోసంకే తాను కాంగ్రెస్‌లో చేరానని ఎమ్మెల్సీ భూపతి రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పట్ల తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో టిఆర్ఎస్ విఫలమైందన్నారు. టిఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిందని ఆరోపించారు. హామీలు నెరవేర్చడంలో నాలుగున్నరేళ్లలో టిఆర్ఎస్ ప్రజామద్దతు కోల్పోయిందన్నారు.