ఒంగోలు : గ్రూప్-1 పరీక్షలో ప్రకాశం జిల్లా మార్కాపురం యువకుడు పలకల్లోనే కాదు చదువుల్లోనూ గుర్తింపు తెచ్చాడు. అక్షరాలు దిద్దే మార్కాపురం పకలకు ప్రపంచ గుర్తింపు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. బుధవారం వెల్లడైన 2011 ఏపీపీఎస్సీ గ్రూప్-1 తుది ఫలితాల్లో ఆకుల వెంకటరమణ రాష్ట్రస్థాయిలో తొలిర్యాంకు సాధించాడు. రాతపరీక్షలో 426 మార్కులు, ముఖాముఖిలో 63.5 మార్కులు సాధించి మొత్తం 489.5 మార్కులతో రమణ తొలిస్థానంలో నిలిచాడు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆ యువకుడు చిన్నతనం నుంచి ప్రభుత్వ బడిలోనే అక్షరాలు దిద్దాడు. తొలిప్రయత్నంలోనే ఈ ఘనత సాధించడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వెంకటరమణ కుటుంబ నేపథ్యం పూర్తిగా వ్యవసాయ ఆధారితమే. తల్లిదండ్రులు ఆకుల శ్రీరాములు, లక్ష్మీనరసమ్మలు మార్కాపురం పట్టణ సమీపంలో రెండెకరాల్లో సాగు చేసుకుంటూ నలుగురు కుమారులను చదివించారు.
కొన్నేళ్ల కిందట తల్లిదండ్రులిద్దరూ మరణించినా హైదరాబాద్‌లో పెద్ద అన్నయ్య వెంకటనరసింహారావు వద్ద ఉంటూ ఉద్యోగం చేస్తూనే గ్రూప్-1లో సత్తా చాటాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్వచ్ఛంద సంస్థ సుస్థిర వ్యవసాయ కేంద్రంలోని సహజ ఆహారం విభాగంలో ఉన్నతస్థాయి ఉద్యోగిగా సేవలందిస్తున్నారు. ‘బీటెక్ తర్వాత ఖాళీ సమయాల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధించేవాడిని. ఆ సమయంలో గ్రూప్స్, ఐఏఎస్‌లో స్థిరపడాలనే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు, అన్నయ్య ప్రోత్సాహంతో వెళ్లి గ్రూప్-1 రాసినట్లు తెలిపారు. వ్యవసాయంలో విశేషంగా సేవలందించడం, విద్యారంగంలో మార్పులకు నాంది పలకడమే తన ప్రాథమ్యాంశాలుగా పేర్కొన్నారు. వీటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తానని తెలిపారు.