అమరావతి : బిజెపితో టిడిపి బందం తెగిపోవడంతో టిడిపితో పంచుకున్న మంత్రిపదవులను సైతం బిజెపి వదులుకుంది. మూడు నెలల క్రితం బిజెపి టిడికి దూరమైంది. అప్పటి వరకు మంత్రలుగా కొనసాగిన కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ, దేవాదాయ, ధర్మాదాయ శాఖలు రెండూ ఖాళీగా ఉన్నాయి. మంత్రిల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ రెండు బెర్తులు భర్తీ చేయడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న ప్రక్రియ.
ఎంఎల్‌సి ఎన్నికల సమయంలో జరిగిన అనూహ్య పరిణామాల నేపద్యంలో చీరాల నుండి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి చెందిన పోతుల సునీతకు ఎంఎల్‌సి పదవి దక్కింది. అప్పట్లో చేనేతల సమస్యలపై పవన్ కళ్యాణ్ మంగళగిరిలో దీక్ష చేపట్టడం, చీరాల టిడిపిలో వివాదం నేపధ్యంలో ఆమెకు అవకాశం కల్పించినట్లు అప్పట్లో చర్చ జరిగింది. అదే తరహాలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కాపుల అంశం తెరపైకి వచ్చింది. బిసిలు, కమ్మ, కాపు సామాజికవర్గాల పునదిపై ఆధారపడిన టిడిపికి ఇప్పుడు కాపు సామాజికవర్గ ఓటింగ్ పునాదిని కాపాడుకోవడం కూడా అవసరమైంది. పవన్‌కళ్యాణ్ ఒకవైపు, ముద్రగడ పద్మనాభం మరోవైపు టిడిపిని తూర్పారపడుతున్నారు. వీరిద్దరికి మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ బిజెపి నాయకునిగా టిడిపిపై యుద్దానికి తోడయ్యారు. దీంతో కాపుల అంశం చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ఇంకా ఎనిమిదినెలల గడువు ఉండటంతో ఖాళీ అయిన రెండు మంత్రిపదవులను భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు సామాజికమాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది.
కామినేని శ్రీనివాసరావు వైద్యారోగ్య శాఖ మంత్రిగా రాజీనామా చేశారు. ఆయన స్థానానికి దూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వైఎస్ఆర్ హయాంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్‌తో కాంగ్రెస్‌కు దగ్గరకు చేర్చుకున్నారు. ఈ నేపద్యంలో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ ఉంది. మరో మంత్రి మాణిక్యాలరావు. దేవాదాయ, ధర్మాదాయ శాఖకు రాజీనామా చేశారు. ఈయన కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ప్రస్తుతం పవన్‌కళ్యాణ్, ముద్రగడ పద్మనాభం, కన్న లక్ష్మినారాయణలు చేస్తున్న వివాదాన్ని ఎదుర్కొనేందుకు అదే సామాజికవర్గానికి ఇస్తే ఎలా ఉంటుందనే చర్చలో చీరాల ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ పేరును ప్రస్తావనకు తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా నుండి శిద్దా రాఘవరావు ఒక్కరే మంత్రిగా ఉన్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో జిల్లాకు రెండో పదవి ఇచ్చే అంశంపైకూడా సానుకూల వాతావరణం ఉన్నట్లు చర్చిస్తున్నారు.
మంత్రులుగా… గతంలో చీరాల నుండి ఎన్నికైన ఎంఎల్ఎలు
రాష్ట్ర శాసన సభ ఆవిర్భవించినప్పటి నుండి చీరాల నుండి ఎన్నికైన శాసన సభ్యులు ఎక్కువ కాలం మంత్రి పదువులు నిర్వహించారు. ఎంఎల్‌సిగా ఎన్నికైన వడ్డె నాగేశ్వరరావు పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. డాక్టర్ కొణిజేటి రోశయ్య చీరాల నుండి మూడు దఫాలు శాసన సభకు ఎన్నికై మూడు దఫాలు ఆర్ధిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఎన్‌టిఆర్ క్యాబినేట్‌లో డాక్టర్ పాలేటి రామారావు పశుసంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్‌పేరు తెరపైకి రావడం నియోజకవర్గంలో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.
అప్పట్లో యాదృశ్చికంగానే బ్యానర్ కట్టారా?
“కలలు కనండి. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడండి.“ అన్న సూక్తికి ఈ బ్యానరే నిదర్శనం కానుందా? డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2004-09మద్య కాలంలో చీరాల్లో జరిగే అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు డాక్టర్ కొణిజేటి రోశయ్య చీరాల నియోజకవర్గంలో అనేక పర్యటనలు చేశారు. కొత్తపేట పంచాయితీలో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో ప్రజాప్రతినిధులకు బ్యానర్లు కట్టారు. అప్పట్లో వేటపాలెం ఎంపిపిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌కు కొత్తపేట ఉపసర్పంచిగా పనిచేసిన సోమిశెట్టి రమేష్, ఎస్‌కె వలి, ఎస్ఎం బాషాలు చేతిరాతతో బ్యానర్ కట్టారు. ఎంపిపి ఆమంచి కృష్ణమోహన్ అని రాయాల్సిన చోట రాష్ట్ర ఆర్ధిక మరియు వైద్యారోగ్య శాఖ మంత్రి అంటూ 2007లోనే కొత్తపేటలో బ్యానర్ కట్టారు. అప్పట్లో ఆ బ్యానర్ గురించి అందరూ చర్చించుకున్నారు. ఇదేంటి? అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ బ్యానర్‌పై రాసిన అంశమే పరిశీలనకు రావడం గమనార్హం. ఖాళీ అయిన రెండు మంత్రి పదవులు ఎప్పట్లో భర్తీ చేస్తారు? ఎవరిని వరిస్తుంది? అసలు భర్తీ చేస్తారా? అనే అంశాలకు ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయమే సమాధానం.
https://youtu.be/NDAWlH6n7Dk