గుంటూరు (దమ్ము) : రాజ్యసభ సభ్యులు, రాంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆళ్ల అయోధ్యరామిరెడ్డి శుక్రవారం స్థానిక రామన్నపేటలోని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ కార్యాలయాన్ని సందర్శించారు. గుంటూరు పర్యటన సందర్భంగా రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో ఆహ్వానం మేరకు మర్యాదపూర్వకంగా విచ్చేశారు. ఈ సందర్భంగా మద్యవిమోచన ప్రచార కమిటీ కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన విప్లవాత్మక నిర్ణయాలను ఎంపీ కొనియాడారు. ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ తరపున నిర్వహిస్తున్న బహుముఖ కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో 30శాతం లిక్కర్, 60శాతం బీరు వినియోగం తగ్గిందని లక్ష్మణరెడ్డి వివరించారు. అదేవిధంగా మద్యం మహమ్మారి దుష్ప్రభావాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు షార్ట్ ఫిల్మ్ పోటీల ఆలోచన మంచిదని లక్ష్మణరెడ్డిని అభినందించారు. కారుమంచిలో గత ఐదేళ్లుగా మాఊరు అభివృద్ధి కమిటీ చైర్మన్ గా కూడా లక్ష్మణరెడ్డి విస్తృత కార్యక్రమాలకు కమిటీకి, గ్రామాభివృద్ధికి తనవంతు సాయం అందిస్తామని హామీనిచ్చారు. అలాగే రాజకీయ పరిస్థితులను చర్చించారు.