షిర్డీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులకు దర్శనం పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై షిర్డీ శ్రీ సాయిబాబా సంస్థాన్ అధికారులు టీటీడీ నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు. భక్తులకు దర్శనాలు కల్పించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించేందుకు శ్రీ సాయిబాబా సంస్థాన్ ఆహ్వానం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, సభ్యులు కె శివ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవి ధర్మారెడ్డి షిర్డీ చేరుకుని అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భక్తులకు దర్శనం కల్పించడంలో టిటిడి తీసుకున్న చర్యలను ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ వివరించారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేసి వాహనాలను శానిటైజ్ చేసిన అనంతరం అనుమతించామన్నారు. శ్రీవారి ఆలయం, భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రాంతాల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి శానిటైజ్ చేస్తున్నామని చెప్పారు. క్యూలైన్లలో భక్తులు భౌతిక దూరం పాటించేలా 2మీటర్ల దూరంలో మార్కింగ్ చేశామన్నారు. గదులు పొందే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆల్టర్నేట్ పద్ధతిలో కేటాయించామని చెప్పారు. ఖాళీ చేసిన అనంతరం పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాతే మరొకరికి కేటాయించేలా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. భక్తులకు దగ్గరగా ఉండే సిబ్బందికి పిపిఇ కిట్లు అందజేశామన్నారు. సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందించామని తెలిపారు. కార్యక్రమంలో షిరిడి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తనురాజ్ హరిశ్చంద్ర భగటే, డెప్యూటి సిఈఓ రవీంద్ర, ఇఇ రఘునాథ్, తదితరులు పాల్గొన్నారు.