పర్చూరు : పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో స్వామివారి ప్రతిరూపంగా భావించే లడ్డు ప్రసాదంలో కమిషన్లకు కక్కుర్తి పడి కల్తీ నెయ్యి, అందులోను జంతు వ్యర్ధాలతో తయారు చేసిన నూనె నుండి తీసిన నెయ్యి వాడటం ఎంతో బాధాకరమని అర్చక సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారి వేదాంతం కిరణ్‌కుమార్ అన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నిత్య ప్రసాదాల నివేదనల్లో జరిగిన అపచారం గురించి తెలిసి ఎంతో విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనను అందరూ ఖండించాలని కోరారు. ఈ కల్తీ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అందరినీ కఠినంగా శిక్షించాలని కోరారు. సమావేశంలో అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి దిట్టకవి వాసుదేవ సంపత్ కుమార్ ఆచార్యులు, మూలంరాజు రాజ్ కుమార్, నారాయణం శ్రీనివాసాచార్యు పాల్గొన్నారు.