Home ఆధ్యాత్మికం ప్రకృతి ఆరాధన వినాయక చవితి

ప్రకృతి ఆరాధన వినాయక చవితి

430
0

కోటి సూర్యులకు సమానమైన గణపతికి వీలుకాని కార్యం లేదు. ఈ చరా చర సృష్టిలో వినాయకుడికి సాధ్యం కానిది లేదని గణేశశక్తిని ఆరాధించే భక్తులు నమ్ముతారు. రూపాలు వేరైనా గణనాధుడు ఒక్కడే. ఆది దేవుడికి అనంతకోటి దండాలతో పూజలు చేస్తారు. అందులో మట్టి గణపతిని పూజిస్తే ప్రకృతిని పూజించినట్లేనని పెద్దలు చెబుతుంటారు.

ఈ పండగ ప్రకృతితో ముడిపడి వుంటుంది. పూజకు ఉపయోగించే మట్టి వినాయకుడి ప్రతిమగానీ, పత్రిగానీ ప్రకృతికి ప్రతిరూపాలే. మనం జరుపుకునే ప్రతి పండుగ, ఆ పండుగల సాంప్రదాయాలు వ్యవసాయానికి అనుసంధానించే ఉంటాయి. వినాయకచవితి కూడా అలాగే! భాద్రపద మాసం చవితి రోజున వినాయకుడికి పూజలు చేసి పండుగ జరుపుకుంటాం! విఘ్నాల నుంచి కాపాడాలని వేడుకుంటాం! భాద్రపద మాసంలోనే వ్యవసాయ తొలి సీజన్‌ ఖరీఫ్‌ ఉంటుంది. రైతులంతా నాట్లు వేయడంలో తీరిక లేకుండా ఉంటారు. అందుకే విఘ్నేశ్వరుడికి తొలి పూజ చేసి రైతులు జీవనాధారమైన వ్యవసాయ పనులను మొదలుపెడతారు.

*గణేశుని ఆకృతికి వ్యవసాయానికి దగ్గరి పోలిక…*
వినాయకుడి శరీరం ఏనుగు అంటే భారీ పదార్థమన్నమాట.! ఫిజిక్స్‌లో చెప్పాలంటే మెటీరియల్‌. పదార్థం నుంచే సృష్టి జరుగుతుంది. ఆలోచనలు వస్తాయని చెబుతుంటారు. మట్టి నుంచే ధాన్యపు సిరి, సంపద పండుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వినాయకుడు భూమికి ప్రతీక. ఆయన ఏనుగు మొహం బుద్ధికి ప్రతీక. ఆయన ఏకదంతం నాగలికి చిహ్నం. ఆయనకున్న పెద్ద చెవులు ధాన్యాన్ని తూర్పారబట్టే చేటలకు సంకేతం. ఆయన పెద్ద బొజ్జ ధాన్యాన్ని దాచుకునే గాదెకు గుర్తు. తల భాగమేమో గాదెపై బోర్లించిన గంపను గుర్తు చేస్తుంది.

ఆయన వాహనం ఎలుక. అంటే దానికి కూడా ఓ అర్థం ఉంది. పంటలను పాడు చేసేవి ఎలకలే. వాటిని అణచి వేయడానికి సింబలే ఆ వాహనం. పొట్టను పాములతో బిగించి కట్టుకోవడానికున్న కారణం కూడా ఇదే. ఇక వినాయక పూజలో మనం 21రకాల పత్రిలను వాడతాం. అవన్నీ మన ప్రాచీన వైద్య విధానంలో ఔషధాలే. ఇవన్నీ మన పంటపొలాల పక్కన కనిపిస్తాయి. వినాయకుడు వ్యవసాయ ప్రధాన దేవుడేననేందుకు ఇవే ఆధారం.

మట్టిలో నుంచే సకల ప్రాణులు, సంపదలు వచ్చాయనేది మనందరికీ తెలిసిన విషయమే. అంటే మట్టి వినాయకుని చేయాలంటే చెరువుల నుంచి బంకమట్టిని సేకరించాలి. ఇంటికో గంపెడు మట్టి తీయడంవల్ల తమకు తెలియకుండానే తలో చెయ్యివేసి అందరు చెరువుల్లో పూడిక తీసినట్టవుతుంది. చెరువుల్ని బాగు చేసినవారవుతారు.

పురాణాల్లో అసలు కారణం మరొకటి ఉంది. వినాయకుడు పుట్టింది పార్వతీదేవి మేని నలుగు మట్టి నుంచే కాబట్టి ఆయన విగ్రహాన్ని మట్టితోనే చేయాలి. మట్టి వినాయకునే పూజించాలి. అప్పుడే భక్తి, ముక్తి, శక్తి. మట్టి వినాయకుడిని పూజించడమంటే ప్రకృతిని పూజించడంతో సమానం. మనకు జీవాన్ని, జీవితాన్ని, మనుగడని ఇస్తున్న ప్రకృతిని పూజించే అవకాశం వినాయకచవితి ద్వారా లభిస్తోంది. అలాంటి అవకాశాన్ని వినియోగించుకుని మట్టి వినాయకుడిని పూజించాలి. మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యతను నిర్వర్తించిన వారమవుతాం. అందుకే వినాయకుడి బొమ్మను మట్టితోనే చేయాలని శాస్త్రం చెబుతోంది.