చీరాల : చీరాల రాజకీయాల్లో అరుదైన సన్నివేశం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో చోటు చేసుకుంది. చేనేత నేస్తం పథకం ప్రారంభ సభ శనివారం చీరాల ఎన్‌ఆర్ అండ్ పిఎం ఉన్నత పాఠశాల మైదానంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పథకం ప్రారంభ సభకు అధికార పార్టీ నేతలతోపాటు ప్రతిపక్ష టిడిపి నేతలనూ ప్రొటోకాల్ ప్రకారం అధికారులు ఆహ్వానించారు. అధికారుల ఆహ్వానం మేరకు ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణమూర్తి, ఎంఎల్‌సి పోతుల సునీత హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందు నేతలందరూ వేదికపై ఆశీనులయ్యారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వేదికపై మద్యలో కూర్చోగా ఆయనకు ఒకవైపు ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణమూర్తి, ఎంఎల్‌సి పోతుల సునీత, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి కూర్చోగా మరోవైపు మాజీ ఎంఎల్‌ఎ ఆమంచి కృష్ణమోహన్, మాజీ ఎంపి చిమట సాంబు కూర్చుని మంత్రి బాలినేనితో చర్చించడం సభలో ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గ రాజకీయాల్లో ఒకరికొకరు ప్రత్యర్ధులుగా ఉన్న నేతలందరూ ఒకే వేదికపై కూర్చోవడం పట్టణంలో కొత్త చర్చకు దారితీసింది. ప్రభుత్వ కార్యక్రమమైనప్పటికీ ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం నియోజకవర్గ రాజకీయాల్లో ఇటీవల కాలంలో అరుదైన సన్నివేశం.
గత కొన్నేళ్లుగా ప్రభుత్వ కార్యక్రమమైనా ప్రతిపక్ష నేతలు హాజరైతే ప్రొటోకాల్ పేరుతో జరిగిన వివాదాలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కానీ చేనేత నేస్తం పథకం ప్రారంభ సభలో అందరూ ఒకే వేదికపై కూర్చోవడం, అధికారిక సభ ప్రారంభం అయిన అనంతరం మాజీలైన నేతలందరూ వేదిక దిగి ఎదురుగా జనంతో కూర్చోవడం వంటి అంశాలను సభకు హాజరైన వారితోపాటు ఆ సన్నివేశాలను టివీల్లో చూసిన జనం కూడా చర్చించుకున్నారు.