Home ప్రకాశం బాల్యం చిన్నారుల హక్కు : తాడివలస దేవరాజు

బాల్యం చిన్నారుల హక్కు : తాడివలస దేవరాజు

406
0

– బాలల హక్కులు కాపాడటం మనందరి బాధ్యత.
– రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ చిన్నారులకు అండగా వుంటుంది.
– రోటరీ ఆధ్వర్యంలో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
చీరాల : చదువు పేరుతో చిన్నారులపై ఒత్తిడి పెంచకుండా వారికి స్వేచ్చ నిచ్చి వారి మనోవికాసానికి తోడ్పాటు నిద్దామని రోటరి క్లబ్ క్షీరపురి కార్యదర్శి, శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ ఎండీ, చీరాల జిల్లా సాధన జాక్ కన్వీనర్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం జేమ్స్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో చిన్నారులపై ఒత్తిడి ఎక్కువయిందన్నారు. .మార్కుల పేరుతో తల్లిదండ్రులు తీవ్ర మైన భారం వేస్తున్నారని అన్నారు. ఇది చిన్నారుల్లో మానసిక ఆందోళనకు కారణం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలలకు హక్కులు ఉంటాయని వాటిని గుర్తించాలని చెప్పారు. పాశ్చాత్స దేశాల్లో ఈ హక్కుల అమలు విషయంలో కఠినంగా ఉంటారని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు ముఖ్యమేనని తెలిపారు. మైదానంలో ఆటలు ఆడటం వలన శారీరక మానసిక వికాసం ఉంటుందన్నారు.

తల్లిదండ్రులు తమ ఇష్టాలను పిల్లలపై రుద్దకుండా వారి అభిరుచులను గౌరవించాలని సూచించారు. వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహించేయాలన్నారు. అపుడే వారి ప్రతిభ బయటకు వస్తుందని తెలిపారు. చేసే పనిపట్ల ఆసక్తి ఉన్నపుడే ఉన్నత స్థానాలకు చేరుతారని చెప్పారు. క్లబ్ అధ్యక్షులు రావి వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి పాఠశాలకు వచ్చే విధంగా, వారి ఆలోచనలకు అడ్డుకట్ట వేయకుండా స్వేచ్ఛగా ఉండే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బంగారు తల్లి, సాంబశివరావు, పద్మావతి ,రమా, వాణి, పాండురంగారావు, కాశీ చంద్ పాల్గొన్నారు.