– ఆధునిక పద్దతులు తెలుసుకోవాలన్న కామాక్షి హాస్పిటల్ ఎండి దేవరాజు
– మారుతున్న చికిత్స పద్దతులపై ప్రాధమిక వైద్యులకు శిక్షణ
– అవగాహన కల్పించిన ఎస్‌జె అంబులెన్స్, రెడ్‌క్రాస్ ప్రతినిధులు
– శిక్షణకు జిల్లా వ్యాప్తంగా హాజరైన ప్రాధమిక వైద్యులు
చీరాల : వైద్యరంగంలో వస్తున్న ఆధునిక పద్దతులపై ప్రాధమిక వైద్యులు ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. చీరాల ఎన్‌జిఒ భవన్‌లో ప్రాధమిక వైద్యులకు ఆధునిక వైద్యపద్దతులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా శిక్షణ ప్రారంభ సభలో దేవరాజు మాట్లాడుతూ మారుతున్న వేగవంతమైన జీవన విధానంలో వచ్చే కొత్తకొత్త వ్యాధులకు అవసరమైన చికిత్సలో కూడా ఆధునిక పద్దతులు వస్తున్నాయని చెప్పారు. అలాంటి ఆధునిక పద్దతులపై ప్రాధమిక వైద్యులు అవగాహన కలిగి ఉంటే అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు ప్రాణాపాయ స్థితి నుండి కాపాడినవారమవుతామని చెప్పారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు తరచూ ఏర్పాటు చేసుకోవడం ద్వారా వైద్యరంగంలో వస్తున్న మెళుకువలు తెలుసుకోవచ్చని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాధమిక వైద్యుల ద్వారానే ఎక్కువ వైద్యసేవలు అందుతున్నాయన్నారు. రోడ్లు కూడా సరిగాలేని గ్రామాల్లో పనిచేస్తున్న ప్రాధమిక వైద్యులు ఆధునిక పద్దతులు తెలుసుకుంటే ఎంతోమెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రాధమిక వైద్యులకు తమవైపునుండి ఎలాంటి సహకారం కావాలన్నా సహకరిస్తామని చెప్పారు. జిజిహెచ్ వైద్యాధికారి కె విజయశేఖర్ మాట్లాడుతూ ఇంతమంది ప్రాధమిక వైద్యులు శిక్షణకు హాజరు కావడం అభినందనీయమన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని రోగులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. గ్రామీణ వైద్యుల సమాఖ్య వ్యవస్థాపకులు తేలప్రోలు సాంబశివరావు, అధ్యక్షులు శీలం సుగుణరావు, రాష్ట్ర ప్రతినిధి ఉమర్ మాట్లాడుతూ అనుభవం ఉన్న వైద్యులతో నూతన విధానాలు వివరించి ప్రాధమిక వైద్యులనైపుణ్యం పెంపొందించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
రెడ్‌క్రాస్, సెయింట్ జాన్ అంబులెన్స్ ప్రతినిధులచే శిక్షణ
వైద్యరంగంలో మారుతున్న నూతన విధానాలపై సెయింట్ జాన్ అంబులెన్స్, రెడ్‌క్రాస్ ప్రతినిధులు ప్రాధమిక వైద్యులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం వస్తున్న వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన పద్దతులను సులభ పద్దతిలో వివరించారు. శిక్షణకు జిల్లాలోని అన్ని ప్రాంతాలనుండి వైద్యులు పాల్గొన్నట్లు కార్యదర్శి శేఖర్‌బాబు, జి శ్రీనివాసులు తెలిపారు.