Home ప్రకాశం క‌మ్యునిస్టుల కృషితో అమ‌లులోకి వ‌చ్చిన ఉపాధి ప‌థ‌క‌మే గ్రామీణ ప్ర‌జ‌ల‌కు వ‌ర‌మైంది : వి శ్రీ‌నివాస‌రావు

క‌మ్యునిస్టుల కృషితో అమ‌లులోకి వ‌చ్చిన ఉపాధి ప‌థ‌క‌మే గ్రామీణ ప్ర‌జ‌ల‌కు వ‌ర‌మైంది : వి శ్రీ‌నివాస‌రావు

597
0

కొండేపి : వ్యవసాయక కార్మిక సంఘం, ఎర్ర జెండా ఇప్పటికీ పేదలకి అండగా ఉందని రైతు సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. జులై 23, 24తేదీల్లో కొండపిలో జరుగుతున్న ఆంద్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా 15వ మహాసభలలో భాగంగా గ్రామంలో ఎర్రజెండాలు చేతబట్టి భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కొండేపి బస్టాండ్ సెంటర్లో భారీ బహిరంగ సభ జరిగింది. సభలో రైతు సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడారు. 1934లో బ్రిటిష్ వాళ్ల కాలంలో స్వతంత్రం రాకముందు పుచ్చలపల్లి సుందరయ్య వ్య‌వ‌సాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశార‌న్నారు. ఆనాడు సుంద‌ర‌య్య‌ అందించిన వ్యవసాయ కార్మిక సంఘం ఎర్రజెండా ఇప్పటికీ వ్యవసాయ కూలీల కోసం నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు.

ఎన్నిక‌ల‌ప్పుడు అడ‌గ‌కుండా హామీలు ఇచ్చే రాజ‌కీయ నేత‌లు పేద‌లు అడిగిన ఉపాధి హ‌క్కును మాత్రం అధికారానికి వ‌చ్చినా కూడా ఇవ్వ‌ర‌ని అన్నారు. పదేళ్లక్రితం కమ్యూనిస్టులు ఉపాధి హామీ పథకం సాధించి తీసుకొచ్చారని చెప్పారు. ఆ పథకం గ్రామీణ ప్రజలకు నేడు ఉపాధి చూపుతుంద‌న్నారు. ఉపాధి పథకం ఎర్రజెండా సాధించిన విజయం ఉన్నారు. ఈ రోజు అదే ఉపాధిహామీ పథకం దండగని అధికారానికి వ‌చ్చిన నేత‌లు తీసివేయడానికి ఎన్నో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ పథకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు మనందరిపైన ఉందన్నారు. అసైన్డ్ భూములే కాదు రైతుల భూములు కూడా అభివృద్ధి పేరుతో లాగేసుకుంటున్నారన్నారు. మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు 15లక్షల ఎకరాలు తీసుకుని ఒక్క ఫ్యాక్టరీ అయినా కట్టారా అని ప్ర‌శ్నించారు. గ్రామీణ ప్రజలు పనులు లేక వలసలు పోతున్నారన్నారు. వ్యవసాయ అభివృద్ధి చేయాల్సిన అధికారానికి వ‌చ్చిన నేత‌లు అది వదిలి వ్యవసాయం దండగ అంటున్నారని చెప్పారు. వ్యవసాయాన్ని దండగ చేసింది ఎవరన్నారని ప్ర‌శ్నించారు. ప్రభుత్వం పక్షపాత ధోరణి వలనే ఈరోజు వ్యవసాయ కూలీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.

ఫ్యాక్టరీలు ఏర్పడితేనే అభివృద్ధి అంటున్న మోడీ వ్యవసాయం అభివృద్ధి కాద‌ని, ఇప్పుడు ప్రజలు అన్నం తినడం లేదు చేపలు, మాంసం తింటున్నారని మాట్లాడుతున్న మోడీని పిచ్చాసుపత్రిలో చేర్పించాలన్నారు. ఒక రాకెట్ పంపితే, అణుబాంబులు తయారు చేస్తే సూపర్ పవర్ కాదని అన్నారు. విద్య, వైద్యం, తిండి, బట్ట అందరికీ ఉన్నప్పుడే అభివృద్ధి అన్నారు. విజయమాల్యా లాంటి వాళ్లు, మన రాష్ట్రంలోని రామకృష్ణంరాజు, రాజమోహన్ రెడ్డి, రాయపాటి వంటి బడా వ్యాపారస్తులు వేలకోట్లు ఎగ్గొట్టి, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతూ కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతులు, వ్యవసాయ కూలీలు ఓట్లు వేయకుండా ఈ రాజకీయ నాయకులు గెలిచారా అని ప్ర‌శ్నించారు. వేల కోట్లు దోచుకుంటున్న వారిని వదలి వ్యవసాయ కూలీలకు ఒక రూపాయి పెంచడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్ర‌శ్నించారు. కార్మికులకు ఉన్న చట్టాలు తీసేయడానికి సిద్ధమయ్యారన్నారు. కౌలుదారులకు రక్షణ చట్టం లేదన్నారు. వ్యయసాయం సంక్షోభంలో ఉందన్నారు.

గాంధీని చంపిన ఆర్ఎస్ఎస్ వారసుడు మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పక్కనపెట్టి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే రైతు కూలీలు, మేధావులు ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం కొండేపి నియోజకవర్గ కార్యదర్శి కేజీ మస్తాన్ అధ్యక్షత వహించిన స‌భ‌లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జాలా అంజయ్య, సిపిఎం తూర్పు ప్రకాశం జిల్లా అధ్యక్షులు పూనాటి ఆంజనేయులు, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, రైతు వ్యవసాయ సంఘం సీనియర్ నాయకులు ముప్పరాజు కోటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంటెనపల్లి వెంకటేశ్వర్లు, ఊసా వెంకటేశ్వర్లు, వి మోజేష్, టి రాము పాల్గొన్నారు.