చీరాల : స్వదేశీ నినాదంతో అధికారానికి వచ్చిన బిజెపి స్వదేశీ కుటీర పరిశ్రమైన చేనేత రంగాన్ని తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని, చేనేతకు గత నాలుగేళ్లుగా బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని చేనేత జనసమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహనరావు పేర్కొన్నారు. బడ్జెట్‌లో చేనేత కేటాయింపులపై రాష్ట్రస్థాయి చర్చావేదికను ప్రకాశం జిల్లా చీరాలలో శుక్రవారం చేనేత జనసమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. కేంద్రంలో అధికారానికి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా చేనేతకు నిధులు తగ్గిస్తూ వచ్చారని పేర్కొన్నారు. చేనేత వృత్తి రక్షణకు ఉన్న చేనేత రిజర్వేషన్ చట్టాన్ని కూడా అమలు చేయకుండా చేనేత కుటుంబాల ఉపాధిని దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. కోట్ల నిధులు కంపెనీలకు రాయితీలు ఇస్తూ చేనేతలకు మాత్రం కనీసం పైసాకూడా రాయితీ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. చేనేత వృత్తి రక్షణ రిజర్వేషన్లు అమలు చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖను పట్టిష్టం చేయాలని కోరారు. చేనేతకు బడ్జెట్‌లో నిధులు పెంచాలని కోరుతూ విజయవాడలో త్వరలో విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేసేందుకు కార్యాచరణ ప్రారంభించాలని తీర్మానం చేశారు.
చేనేతల సదస్సుకు వైఎస్ఆర్‌సిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి యడం బాలాజి సంఘీబావం తెలిపారు. చేనేతకు నిధులు కేటాయించాలని కోరారు. వృత్తి రక్షణకు ఉన్న రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని కోరారు. సదస్సుకు దేవన వీరనాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వైసిపి చేనేత నాయకులు బీరక సురేంద్రబాబు, సిపిఐ నాయకులు మేడా వెంకట్రావు, జ్యోతిర్మయి బీరక పరమేష్, సొసైటీ అధ్యక్షులు మాచర్ల గౌరీశంకర్, కర్ణ లచ్ఛారావు, వీరబద్రం, మురళి, శ్రీనివాసరావు, దామర్ల శ్రీఖృష్ణ, కందుల విజయకుమార్, కాటూరి వెంకటేశ్వర్లు, ఉప్పాడ నరసింహారావు, దళిత చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు మద్దు ప్రకాశరావు, కర్ణ హనుమంతరావు, మదనపల్లి, ధర్మవరం, ఉప్పాడ, ఖమ్మం, శ్రీకాకుళం ప్రాంతాల నుండి చేనేత ప్రతినిధులు పాల్గొన్నారు.