Home సినిమా మార్చి 2నుండి సినిమా థియేటర్ల బంద్‌!

మార్చి 2నుండి సినిమా థియేటర్ల బంద్‌!

352
0

– సినిమా బాక్స్‌పంపిణీలో ఆధునిక సాంకేతిక‌త ప్ర‌భావం
– చిత్ర‌ప‌రిశ్ర‌మ‌పై డిజిట‌ల్ స‌ర్వ‌ర్ ప్రొవైడ‌ర్ల మాయాజాలం
– విఫ‌ల‌మూన నిర్మాత‌లు, స‌ర్వ‌ర్‌ ప్రొవైడ‌ర్ల చ‌ర్చ‌లు

బెంగళూరు : చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌స్తుతం డిజిట‌ల్ స‌ర్వ‌ర్ ప్రొవైడ‌ర్ల‌దే కీల‌క‌పాత్ర అయ్యింది. ఒక‌ప్ప‌డు కొత్త సినిమా రిలీజ్ అయితే సినిమా రీళ్లు ధియేట‌ర్ల‌కు వ‌చ్చేవి. కానీ ఇప్ప‌డు ఆ ప‌ర‌స్థితి లేదు. నిర్మాత హైద‌రాబాద్‌లోనే ఉంటాడు. డిస్టిబ్యూట‌ర్లు సైతం హైద‌రాబాద్ నిర్మాత వ‌ద్ద‌నో, ప్రొడ్యూస‌ర్ వ‌ద్ద‌నో ఉంటారు. అక్క‌డినుండే శాటిలైట్ సిగ్న‌ల్ నేరుగా ధియేట‌ర్‌కు ఇస్తారు. ఎలాంటి రీల్ ఖ‌ర్చులు లేకుండా డిజిటలైజేష‌న్ ద్వారా నేరుగా చిత్రం న‌డుస్తుంది. అంత‌వ‌ర‌కు బాగానే ఉంది. కానీ మొద‌ట ధియేట‌ర్‌ను డిజిట‌లైజ్ చేసుకుంటే ఎలాంటి రుసుములు ఉండ‌వ‌ని చెప్పిన స‌ర్వ‌ర్ ప్రొవైడ‌ర్లు ఇప్ప‌డు స‌ర్వ‌ర్ ఖ‌ర్చుల పేరుతో వ‌సూళ్లు మొద‌లు పెట్టారు.

క్యూబ్‌, యూఎఫ్‌వో ప్రతినిధులతో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీ నిర్మాతల ఐక్య‌కార్యాచ‌ర‌ణ స‌మితి(ఐకాస‌) చర్చలు జ‌రిపింది. అయితే చ‌ర్చ‌లు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో మార్చి 2 నుండి దక్షిణాదిలో సినిమాల ప్రదర్శన నిలిపివేతకు నిర్మాతలు, పంపిణీదారులు నిర్ణయించారు. బెంగళూరులోని ఫిలిం ఛాంబర్‌లో దక్షిణాది రాష్ట్రాల సినీ నిర్మాతలు, పంపిణీదారుల ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి శుక్రవారం సమావేశమైంది. సినిమాల ప్రదర్శనకు క్యూబ్‌, యూఎఫ్‌వో అధిక ధరలు వసూలు చేస్తున్నాయనే అంశంపై ఈ భేటీలో చర్చించారు. థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు వసూలు చేస్తున్న ధరలు తగ్గించాలని నిర్మాతల మండలి కోరింది. వారి నిర్ణయాన్ని క్యూబ్‌, యూఎఫ్‌వో ప్రతినిధులు అంగీకరించలేదు. దీంతో మార్చి 2 నుంచి సినిమాల ప్రదర్శన నిలిపివేయాలని నిర్ణయించారు.

ఒక‌ప్పుడు సినిమా రీళ్లు… ఇప్పుడు అంతా డిజిట‌ల్
ఒకప్పుడు సినిమాను రీళ్ల ప్రింట్‌ల ద్వారా ప్రదర్శించే వాళ్లు. బాక్సులను ఒక థియేటర్‌ నుంచి మరొక థియేటర్‌కి పంపే వారు. ఈ రీళ్ల ప్రింట్‌లు దాదాపుగా క‌నుమ‌రుగ‌య్యాయి. సినిమా ప్రదర్శన డిజిటల్‌గా మారింది. చిత్ర పరిశ్రమంలో ఓ విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది. శాటిలైట్‌ ద్వారా సినిమా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అలా పంపిణీ రంగ రూపు రేఖల్ని మార్చేసుకుంది. ఒకప్పుడు ఒక రీల్‌ సినిమా ప్రింట్‌ చేయడానికి రూ.60 నుంచి 70వేల వరకూ అయ్యేది. డిజిటల్‌ సినిమాకు వ్యయం తక్కువ అవుతుండటంతో అందరూ అటువైపే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో యూఎఫ్‌వో, పిఎక్స్‌డీ, క్యూబ్‌ వంటి ‘డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు’ సినిమాను ప్ర‌ద‌ర్వించేందుకు ముందుకు వచ్చాయి. ఇది ఎంతో ఖర్చుతో కూడిన పని. అయితే పైసా ఖర్చు పెట్టకుండా ‘మీ థియేటర్‌ ఇస్తే చాలు అన్నీ మేమే డిజిట‌ల్‌గా మార్చేస్తాం’ అని చెప్పడంతో డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు థియేటర్‌లను ఇచ్చేశారు. అంత ఖర్చు పెట్టి థియేటర్లను డిజిటలైజ్‌ చేయడం వల్ల సర్వీస్‌ ప్రొవైడర్లకు ఏం లాభం అనుకుంటున్నారా? అక్కడే అవి చిన్న మెలిక‌ పెట్టాయి. డిజిటల్‌ సాంకేతికతకు మార్చినందుకు వాళ్ల‌కు ఐదేళ్ల పాటు థియేటర్‌ను ఇస్తే సరిపోతుందన్నారు. ఆ తర్వాత సర్వీసు ఛార్జి తప్ప వర్చువల్‌ ప్రింట్‌ ఫీజ్‌ (వీపీఎఫ్‌) వసూలు చేయమని చెప్పారు.

ధియేట‌ర్ల‌ను డిజిట‌ల్‌గా మార్చేట‌ప్పుడు అలా చెప్పిన డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ఇప్పుడు ఇష్టానుసారంగా వీపీఎఫ్‌, ఇతర ఛార్జీలు వసూలు చేస్తున్నారని తెలుగు చిత్ర పరిశ్రమ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ రంగంలోకి దిగి వాళ్లతో చర్చించింది. నిర్మాత ద‌గ్గుబాటి సురేష్‌బాబు అధ్యక్షతన 45మంది సభ్యులతో ఏర్పాటైన జాయింట్ ‌యాక్షన్‌ కమిటీ శుక్రవారం బెంగళూరులో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానంగా మూడు డిమాండ్లను సర్వీస్‌ ప్రొవైడర్ల ముందుంచారు.

1. ముందు ఇచ్చిన మాట ప్ర‌కారం వెంటనే వీపీఎఫ్‌ తగ్గించాలి. లేదా రద్దు చేయాలి.
2. సినిమా ప్రారంభం, మధ్యలో వేస్తున్న ప్రకటనలను ఎనిమిది నిమిషాలకు పరిమితం చేయాలి.
3. రెండు కొత్త సినిమాల ట్రైలర్లను ప్రతి సినిమాతో ఉచితంగా ప్రదర్శించాలి.

అయితే ఈ మూడు డిమాండ్లకు డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు సముఖత వ్యక్తం చేయలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. మార్చి 2వ తేదీ నుండి థియేటర్లను బంద్‌ చేయాలని సినీ నిర్మాతల ఐక్య‌కార్యాచ‌ర‌ణ స‌మితి నిర్ణయించింది.

త‌ర్వాత‌ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాం!
‘‘ప్రస్తుతం హాలీవుడ్‌ సినిమాలకు వర్చువల్‌ ప్రింట్‌ ఫీజ్‌(వీపీఎఫ్‌)ను డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు వసూలు చేయటం లేదు. ఇదే విషయంపై వారిని ప్రశ్నించాం. అంతేకాదు, ఇప్పుడు వసూలు చేస్తున్న వీఎపీఎఫ్‌లో 25శాతం తగ్గించి, ఆ తర్వాత క్రమంగా తీసేయాలని కోరాం. వాళ్లు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అంటున్నారు. అప్పట్లో ఎగ్జిబిటర్లవైపు నుండి తప్పు జరిగిన మాట వాస్తవం. దాన్ని అలుసుగా తీసుకుని ఇప్పుడు ఇలా వ్యవహరించడం మంచిదికాదు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాం. ముఖ్యంగా వేసవిలో విడుదలయ్యే సినిమాలపై ఈ ప్రభావం పడకుండా చూస్తాం. ఇందుకు సంబంధించి మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తాం.’’ అని నిర్మాత‌ జెమిని కిరణ్ అన్నారు.