Home ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంస్కరణలతో ఖర్చు నియంత్రణ : మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు

ఎన్నికల సంస్కరణలతో ఖర్చు నియంత్రణ : మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు

812
0

చీరాల : “ప్రజాస్వామ్యంలో ప్రజలు తమను తామే పాలించుకొంటారు. జనాభా తక్కువగా ఉంటే ప్రత్యక్ష, ప్రజాస్వామ్యాన్ని అమలు చేయవచ్చు. జనాభా లక్షల్లోనూ, కోట్లలోనూ ఉంటే ప్రాతినిథ్య ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలి. ప్రపంచమంతా ప్రాతినిథ్య ప్రజాస్వామ్యమే నడుస్తున్నది. ప్రాతినిథ్య ప్రజాస్వామ్యం లో ఎన్నికలు ప్రధాన పాత్ర కలిగి ఉంటాయి. ప్రజలు ఎన్నికల ద్వారా తమ పాలకులను ఎన్నుకొంటారు. 1950 నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల విధానంలోని లోపాలను అప్పుడప్పుడు కొద్దిగా సవరించుకుంటూ వస్తున్నారు.” అంటూ మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ప్రోగ్రాసివ్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బాపనమ్మ కళ్యాణ మండపంలో శనివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.

ఎన్నికల వ్యయం విపరీతంగా ఉండటం, ఓటర్లకు అర్హతలు సరిగా నిర్ణయించకపోవటం, ఓటర్లు డబ్బులకు ఓట్లు అమ్ముకోవటం, ఓట్ల లెక్కింపు విధానం సరిగా లేకపోవటం, రహస్య ఓటింగుతో పాటు బహిరంగ ఓటింగు లేకపోవటం, దొంగ ఓట్లు వేయటం, పోలింగు కేంద్రాలను ఆక్రమించి రిగ్గింగు చేయటం, బలహీనవర్గాలను పోలింగు కేంద్రాలకు రానీయకుండా అడ్డుకోవడటం, ఎన్నికల్లో మితిమీరిన హింస, తక్కువ శాతం పోలింగు కావటం, నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పాల్గొనటం, కుల, మత, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టటం, అధికార యంత్రాంగాన్ని ఎన్నికల్లో దుర్వినియోగం చేయటం, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం, అసంబద్ధమైన వాగ్దానాలు చేయటం, సాధారణ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు, ఉపఎన్నికలతో సంవత్సరం పొడవునా, ఐదు సంవత్సరాల పాటు ఎన్నికల వాతావరణం నెలకొనటం, రాజకీయ పార్టీల నియంత్రణ చట్టం లేకపోవటం, ఎన్నికల సంఘానికి ఎక్కువ అధికారాలు లేకపోవటం, ప్రభుత్వ, ప్రైవేటు మీడియాను దుర్వనియోగం చేయటం, పార్టీ ఫిరాయింపులు మొదలగునవి మన ఎన్నికల విధానంలోని ముఖ్యమైన లోపాలు ఉన్నాయన్నారు.

ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ బలంగా ఉండాలంటే రాజకీయ పార్టీల నియంత్రణ చట్టం చాలా అవసరం. రాజకీయ పార్టీల వ్యవహారాన్ని అంతరంగిక వ్యవహారంగా భావించరాదు. అవి కూడా ప్రజలకు, న్యాయస్థానాలకు, ఎన్నికల సంఘానికి జవాబుదారీగా ఉండాలి. రాజకీయ పార్టీల ఎన్నికలు ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయాలను ‘కాగ్‌’ పరిధిలోకి తేవాలి. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కలిగిన రాజకీయ పార్టీలను మాత్రమే అనుమతించాలి. సాధారణ ఎన్నికల నిర్వహణ సుదీర్ఘకాలంపాటు ఉంటున్నది. దశలు ఎక్కువగా ఉండటం, ఒక్కొక్క దశకు ఎక్కువ కాలపరిమితి ఉండటం వలన సుదీర్ఘ ప్రక్రియగా మారింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోనే ఎన్నికలను నాలుగు దశలలోనే జరపాలన్న నిబంధన ఉండాలి. ఒక్కొక్క దశకు నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉండాలి. ఎన్నికల ప్రకటన తేదీ నుంచి లెక్కింపు తేదీ మధ్య రెండు నెలలకు మించి ఉండకూడదు. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్యలో నాలుగింట మూడు వంతుల స్థానాలను అభ్యర్థులను ఎన్నుకోవటం ద్వారాను, స్థానాలను పార్టీలకు వచ్చిన ఓట్ల నిష్పత్తి ప్రకారం రాజకీయ పార్టీలు సూచించిన అభ్యర్థులను ఎంపిక చేయాలి. పార్లమెంటరీ విధానం వలన మన దేశం లాభపడిందో లేక నష్టపోయిందో అర్థం కావటం లేదని చెప్పారు.

సాధారణ ఎన్నికల్లో మెజారిటీ రాని చోట్ల సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం, కొద్ది రోజుల్లోనే పార్టీ ఫిరాయింపుల వలన అవి కూలిపోవటం, మళ్లీ ఎన్నికలు ఎదుర్కొనవలసి రావటం గత 60 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. చట్టసభల కాలపరిమితి ఐదు సంవత్సరాలని చెప్పినప్పటికీ చాలాసార్లు మధ్యలోనే రద్దవుతున్నాయి. పార్లమెంటరీ విధానంలో ఇదొక పెద్ద లోపం. దేశంలోని అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగే విధంగా రాజ్యాం, చట్టసవరణలు చేసుకోవాలి. కాలపరిమితి ప్రకారమే సాధారణ ఎన్నికలు జరగాలి. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు పార్టీ చిహ్నాల మీద జరిగితే, స్థానిక సంస్థలు, ఇతర సహకార సంఘాల ఎన్నికలు పార్టీ రహితంగా జరగాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం లేక లాటరీ విధానం అనుకరిస్తే ఇంకా మంచిది. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. పోటీ చేసే అభ్యర్థులు ఓట్లను కొనటానికి తెగబడుతున్నారు. ఓటర్లు కూడా చాలామంది ఓట్లు అమ్ముకోవటం తప్పు కాదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఓటుకు ఇంత ఇవ్వాలని పట్టుబట్టే స్థితికి ఓటర్లు వచ్చారు. దీన్ని నివారించటానికి రహస్య ఓటింగుతో పాటు బహిరంగ ఓటు విధానాన్ని ప్రవేశపెట్టాలి. బహిరంగ ఓటింగు విధానం ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది.

ఓటర్లకు కొన్ని అదనపు అర్హతలను నిర్ణయించాలి. ఓట్ల లెక్కింపు విధానంలో మార్పులు చేయాలి. ఓటర్లను మూడు తరగతులుగా వర్గీకరించాలి. పూర్తి అర్హత కలిగిన ఓటర్లు, సగం అర్హత కలిగిన ఓటర్లు, పూర్తిగా అర్హతలేని ఓటర్లుగా విభజించాలి. ఎటువంటి సివిల్‌, క్రిమినల్‌ కేసులు లేని వాళ్లు, ప్రభుత్వాలకు, ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు, స్థానిక సంస్థలకు ఎటువంటి బకాయిలు లేని వాళ్ళను పూర్తి అర్హత కలిగిన ఓటర్లుగా భావించాలి. సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో ఉన్నవారు, ప్రభుత్వ సంస్థలకు, స్థానిక సంస్థలకు బకాయిలు ఉన్నవారు సగం అర్హత కలిగిన ఓటర్లుగా భావించాలి. సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో చార్జిషీట్‌ పెడితే సగం అర్హతే ఉంటుంది. సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో శిక్ష పడినవారు, మతి స్థిమితం లేనివారు, ప్రభుత్వ సంస్థలకు దీర్ఘకాలంగా బకాయిలు ఉన్నవారు, పన్నులు ఎగవేసినవారు, దివాలా తీసినవారు పూర్తిగా అర్హతలేని ఓటర్లుగా భావించాలి. మొదటి, రెండవ తరగతి ఓటర్లకు ఓటు వేసే హక్కు ఉంటుంది. మొదటి తరగతి ఓటర్లను ఒక రకం బ్యాలట్‌ బాక్స్‌, రెండవ రకం ఓటర్లకు మరొక రకం బ్యాలట్‌ బాక్సు ఉండాలి. ఓట్ల లెక్కింపులో మొదట మొదటి రకం బాక్స్‌లోని ఓట్లను లెక్కించాలి. ఓట్లు సమానంగా వచ్చినప్పుడు లేక అతి తక్కువ మెజారిటీ వచ్చినపుడు రెండవ రకం బాక్స్‌ ఓట్లను లెక్కించాలి. ఈ పద్ధతి వలన ఓటర్లు బాధ్యత కలిగి ఉంటారు. ప్రభుత్వాలకు బకాయిలు పెట్టరు. బాధ్యతతో మెలిగే ఓటర్లుకు విలువ పెరుగుతుంది.

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశం భారత దేశమేనని అందరూ చెబుతుంటారు. మన ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ మేడిపండులాగానో, నేతి బీరకాయలాగానో మారకూడదు. ఎన్నికల సంస్కరణలను త్వరగా ప్రవేశపెట్టి భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా చూపాలి. అప్పుడే మన స్వాతంత్ర్యం సమరయోధుల పోరాటాలు ఫలవంతమవుఆయి. ఈ దిశగా అన్ని రాజకీయ పక్షాలు నడుం బిగించి ఎన్నికల సంస్కరణల కొరకు పోరాడాలని చెప్పారు. సదస్సులో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గౌరాబత్తిన సూరిబాబు, జంపాల గంగాధరరావు పాల్గొన్నారు.