హైదరాబాద్ : “గతంలో మంత్రి పదవి ఇవ్వకుండా మోసం చేశారు. ఇప్పుడు టికెట్ ఇవ్వకుండా నాపేరు హోల్డ్‌లోపెట్ట మరోసారి మోసం చేశారు. పార్టీకి నష్టం చేసే ఏ పనీ చేయలేదు. ఎవని ప్రభావంతో నాకు టికెట్ ఆపారు. సర్వే వివరాలు బయట పెట్టాలి. 105మందికి బిఫారాలు ఇస్తామని ఖచ్చితంగా ప్రకటించాలి. నేను చేసిన తప్పేంటని టిఆర్ఎస్‌ను ప్రశ్నిస్తున్నా. టిఆర్ఎస్ నుండి మేము ఏలాభం పొందలేదు. 24గంటల్లో టిఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం ప్రకటించకపోతే పార్టీలో మాకు జరిగిన అన్యాయంపై బహిరంగ లేఖ రాసి నిర్ణయం తీసుకుంటాం.“ అంటూ వరంగల్ టిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కొండా సురేఖ, కొండ మురళి దంపతులు ప్రకటించారు. శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్‌గాంధీ, బిజెపి అధ్యక్షులు అమిత్‌షా లేకుంటే ఇంకెవరైనా నాయకులు డిల్లీ వస్తున్నారంటే తమ ఫోన్లు, తమ వాహనాల డ్రైవర్ల ఫోన్లు టాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల పార్టీ చేయించిన సర్వేలో కొండా సురేఖకు వ్యక్తిగతంగా 63శాతం వచ్చిందని పేర్కొన్నారు. కానీ 33శాతం వచ్చిన వారికి టికెట్ ఇచ్చారని ఆరోపించారు. ఇప్పుడు ప్రకటించిన 105మందికీ బీ ఫారాలు ఇస్తారా? అని ప్రశ్నించారు. తమవల్ల వాళ్లకు నష్టం జరుగుతుంది తప్ప తమకేమీ కాదని పేర్కొన్నారు. తాము రోడ్డు మీదలేమన్నారు. కెటిఆర్ కోటరీని తయారు చేసుకునేందుకు, తెలంగాణాను ఆగం చేసుకునేందుకు తమ లాంటి వారిని బలిచేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీకి తాము లాయల్‌గానే ఉన్నాం కదా? కాంగ్రెస్‌లో డికె అరుణ వాళ్లతో మంత్రులుగా పనిచేసినప్పటికీ టిఆర్ఎస్‌లోకి వచ్చిన తర్వాత కనీసం వారితో మాట్లాడలేదన్నారు.
దయాకరరావు మేము టిడిపిలోకి వస్తామని ప్రచారం జరిగితే ఎలా వస్తారు? తాను కట్టుకోట కోట అన్నారు. ఇప్పుడు టిఆర్ఎస్‌లోకి వచ్చారు. ఇదేమన్నా ఆయన కోటా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌నుండి వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్మి జగన్‌తో వెళ్లా ఆతర్వాత టిఆర్ఎస్‌లోకి వచ్చాం. మేము వైఎస్ఆర్ కుటుంబంతో వెళ్లిన తర్వాతనే ఆయన పార్టీ పెట్టారు. అది పార్టీ మారినట్లు కాదు. జగన్ సమైఖ్య ఆంద్రా నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణ కోసం టిఆర్ఎస్‌లోకి వచ్చామని చెప్పారు. ఏ పార్టీలోకి వెళ్లతాం. ఏనిర్ణయం తీసుకుంటాం. అనేది బహిరంగ లేఖ రాసి మీ (మీడియా) సమక్షంలోనే చెబుతామని కొండా మురళి పేర్కొన్నారు. తామేమిటో వరంగల్ జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు. రాష్ట్రంలో ముందస్తుకు వెళ్లడం కరెక్టెనా అని విలేకర్లడిగిన ప్రశ్నకు కరెక్టు కాదని సురేఖ సమాధానం ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేస్తే మనకు మనమే ప్రభుత్వాన్ని పడగొట్టడం కరెక్టు కాదని తన అభిప్రాయ మన్నారు. టికెట్ ప్రకటించకపోవడంతో తమ ఆత్మాభిమానం దెబ్బతిన్నది కాబట్టే బయటికి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు.