బాపట్ల : రైతుకూలీ సంఘం, మత్య్సకారుల సంఘం ఆధ్వర్యంలో బాపట్ల మండలం సముద్రతీర గ్రామమైన కఠారిపాలెం మత్య్సకారులు గురువారం తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తొలుత పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తహశీల్దారు కార్యాలయం వద్ద జరిగిన ధర్నావద్ద వలలు, బోట్లను ప్రదర్శనగా ఉంచి ధర్నాలో మహిళలు, మత్య్సకార గ్రామ ప్రజలు కూర్చున్నారు.
ధర్నానుద్దేశించి మత్య్సకార సంఘం నాయకులు మాట్లాడుతూ బల్లలతో సముద్రంలో వేట చేయడం వల్ల మత్య్స సంపద తరిగిపోతుందని చెప్పడంలో అర్ధం లేదని పేర్కొన్నారు. తీరం వెంట రొయ్యల చెరువులు, చేపల చెరువులతోపాటు ఆధునిక పరిశ్రమలు వదిలే రసాయన వ్యర్ధాలతో సముద్రంలో చేపల సంపద గుడ్డు దశలోనే అంతరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి కాలుష్య కారణమైన వాటిపై చర్యలు తీసుకోకుండా సాంప్రదాయ మత్య్సకారులను వేటకు వెళ్లనివ్వకూడదని మత్య్సకారుల మద్య వివాదాలు సృష్టించడం మంచిపద్దతి కాదన్నారు. ఈ చర్యలపై ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకుని పరిష్కారం చేయాలని కోరుతున్నారు.