కొండపి : కేరళ వరద దృశ్యాలను ఆ చిన్నారులు టివిల్లో చూశారు. ఏదైనా చేయాలని స్పందించారు. అంతే ఆ పాఠశాల విద్యార్ధులు పట్టణంలోని వీధులన్నీ జోలెపట్టారు. దాతలనుండి విరాళాలు సేకరించారు. చిన్నారుల స్పందన చూసిన పాఠశాల యాజమాన్యం స్పందించింది. చిన్నారులు సేకరించిన మొత్తానికి తాము కొంత కలిపి మొత్తం రూ.రూ.65వేలు పోగు చేశారు. ఈ మొత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి పంపేదుకు యూనియన్ బ్యాంకు మేనేజర్‌ను పాఠశాలకు ఆహ్వానించారు.
ఈసందర్భంగా కె.ఉప్పలపాడులోని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పాపారావు పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ చిడిపోతు శిశిర్‌చౌదరి మాట్లాడుతూ చిన్నతనంలోనే విద్యార్థులు సామాజిక సేవ చేయడం గొప్ప విషమన్నారు. గత నెలలో వరద బీభత్సవానికి కకావికలమై నిరాశ్రయులయిన ‘కేరళ’ వరదబాధితులకు అండగా మేముకూడా ఉన్నామంటూ తమ పాఠశాల విద్యార్ధులు చేసిన కృషిని అభినందించారు. కె.ఉప్పలపాడు గ్రామంలో విద్యార్ధులు ఇంటింటికీ తిరిగి విరాళాలు సేకరించారు. విద్యార్ధులు తెచ్చిన విరాళాలకు పాఠశాల యాజమాన్యం కొంత కలిపి మొత్తం రూ.65వేలను యూనియన్ బ్యాంక్ బ్రాంచి మేనేజర్ రెంజు రంజన్, డిప్యూటీ బ్రాంచి మేనేజర్ సిహెచ్ వెంకటేష్‌లకు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ టి అనూరాధ పాల్గొన్నారు.