కడప : ఉద్యోగ విరమణ అనంతరం… పోటీపరిక్షాలకు సిద్ధమయ్యే వారికి గైడ్ లా సూచనలు చేశారు. ఆ తర్వాత ప్రజాసమస్యల అధ్యయనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. అధికారిగా విధుల్లో ఉన్న కాలంలో కేసుల విచారణతో సిబిఐ అధికారిగా సంచలనం సృష్టించారు. ఆయనే సిబిఐ మాజీ అధికారి వివి లక్ష్మీనారాయణ. ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయమే శ్రేయస్కరమని భావిస్తే రాజకీయాల్లోకి రావడానికి వెనకాడే ప్రసక్తే లేదని తాజాగా పునరుద్ఘాటించారు.
కడప జిల్లా పర్యటనలో ఆరో రోజైన సోమవారం ఆయన కడపలో పలువురు అధికారులు, మేధావులను కలుస్తున్నారు. ఎస్పీ బాబూజీ అట్టాడ, జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావును కలిశారు. ఆరు రోజుల పాటు రైతులు, విద్యార్థులు, గ్రామస్తులను కలిసి తెలుసుకున్న సమస్యలను వివరించారు. కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయన్నారు. ఆ జిల్లాల పర్యటన తర్వాత సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తానన్నారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతానని అన్నారు. అది సాధ్యం కాకుంటే అన్ని జిల్లాల పర్యటన తర్వాత రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటానాని చెప్పారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వేజోన్ వంటి హామీలను కేంద్రం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.