చీరాల : ప్రతివిద్యార్ధిని శాస్ర్తవేత్తగా అభివృద్ది కావాలని, నూతన పరిశోధనలపై హక్కులను పరిరక్షించుకోవాలని తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని పేర్కొన్నారు. మేధోసంపత్తి హక్కుల పరిరక్షణపై చీరాల యార్లగడ్డ అన్నపూర్ణాంబ మహిళా కళాశాలలో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. మేధోసంపత్తి – హక్కుల రక్షణలో భారత దేశం వెనుకబడి ఉందన్నారు. పసుపు, వేప వంటి ఉత్పత్తులపై హక్కులు పొందడంలో ఆలస్యం చేశామన్నారు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. పేటెంట్ హక్కులు, కాపీరైట్స్, ఇండస్ట్రియల్ డిజైన్, ట్రేడ్‌మార్కులు, భౌగోళిక సంకేతాలు ఐ భానుమతి రైస్ అంశాలపై జరిగే పరిశోధనలలో సరైన సమయంలో హక్కులు పరిరక్షణ జరగాలని కోరారు.
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి
కళాశాల సాధికారితా విభాగం ఆధ్వర్యంలో లింగవివక్షపై ఏర్పాటు చేసిన సెమినార్‌లో తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ధీరజ్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14ప్రకారం స్త్ర్రీ, పురుషులు ఇద్దరూ సమానంగా ఉండాలన్నారు. కులం, మతం, లింగ బేధం ఆధారంగా ఎవరినీ తక్కువగా చూడకూడదని చెప్పారు. ఆర్టికల్ 16ప్రకారం అందరికీ సమాన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. సెమినార్‌లో ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ రమణమ్మ, రాజేశ్వరి, సంతోషికుమారి, ధాత్రికుమారి, హరిహరరావు పాల్గొన్నారు.