చీరాల : అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో జీవిత కాలం పనిచేసిన ఉద్యోగులకు ఉద్యోగ విరమణ ఒక పండుగలా ఉంటుంది. ఎందకంటే ఉద్యోగ విరమణ సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు. ఉద్యోగ విరమణ సమయంలో జీవిత కాలం పనిచేస్తూ పొదుపు చేసుకున్న సొమ్ము ఒక్కసారిగా వస్తుంది. ఉద్యోగ విరమణ తర్వాత బ్రతికినంత కాలం బోరోసాగా పెన్షన్, ఆరోగ్య భీమా వర్తిస్తుంది. కానీ అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలకు అలాంటివేమీ ఉండవు. ఎన్నికలు వస్తుంటే గ్రామాల్లో పోలింగ్ బూతుల్లో ఓట్ల చేపర్పుల నుండి ఓటర్ల సర్వేలు, ఎన్నికలయ్యే వరకు అంగనవాడీలదే చాకిరీ. అంగనవాడీ కేంద్రాల్లో ఎవ్వరైనా గర్భవతులు ఉంటే వాళ్లు కాన్పయ్యేవరకు వారి యోగక్షేమాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాల్సిందీ అంగనవాడీలే. జనాభా లెక్కలు, సమగ్ర సాధికార సర్వేలు వస్తే చెప్పనక్కరలేదు.
గ్రామస్థాయిలో ప్రభుత్వం ఏ పథకం ప్రకటించినా అమలు చేసేందుకు జనంలోకి వెళ్లేది అంగనవాడీలే. కానీ వీరికి ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వం ఎలాంటి బాధ్యత పట్టించుకోవడంలేదని అంగనవాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తకు రూ.50వేలు, ఆయాకు రూ.20వేలు ఉద్యోగ విరమణ బృతి ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని అంగనవాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేటపాలెంలో ఉద్యోగ విరమణ పొందిన కార్యకర్తలు, ఆయాలకు సోమవారం సన్మాన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఉద్యోగ విరమణ పొందిన ఆయాలు, కార్యకర్తలు వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సన్నివేశం కార్యకర్తలందరినీ ఒక్కసారి బావోద్వేగానికి గురిచేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం అంగనవాడీ మహిళల కన్నీళ్లు చూసైనా ఉద్యోగ విరమణ సౌకర్యాలు, ఆరోగ్య భీమా, పెన్షన్ కల్పించాలని కోరుతున్నారు. కార్యక్రమంలో అంగనవాడీ కార్యకర్తలు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.