ఢిల్లీ : దారిదోపిడీ అంటే మనం పాత రోజుల్లో నిర్మానుష్యమైన ప్రాంతంలో వంటరిగా వెళ్లేవారివద్ద ఉన్న వస్తు, ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లడమని విని ఉంటాం. కొందరైతే చూసి ఉంటారు. కానీ దేశరాజధాని ఢిల్లీలో నిత్యం జనం రద్దీగా తిరిగే రోడ్డుపైనే దుండగులు దారి దోపిడీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రద్దీగా ఉండే ఫ్లైఓవర్‌పై అందరూ చూస్తుండగానే కొందరు దుండగులు ఓ వ్యాపారికి తుపాకీ చూపి బెదిరించారు. వ్యాపారి వద్ద నుండి రూ. 70లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గురువారం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఢిల్లీకి చెందిన కౌశిష్ బన్సాల్ అనే వ్యాపారి గత గురువారం తన ఇంటి నుండి కారులో గురుగ్రామ్‌కు బయల్దేరారు. తన కారు నరైనా ప్రాంతంలో ఫ్లైఓవర్‌పై వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి బన్సాల్ కారును ఆపారు. దీంతో కారు వెనుక సీట్లో కూర్చున్న బన్సాల్ దిగేందుకు ప్రయత్నించగా.. దుండగుల్లో ఒకడు తుపాకీతో ఆయనను బెదిరించాడు. అనంతరం మిగతా ఇద్దరు దుండగులు కారు డిక్కీలోని రూ. 70లక్షలతో ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు.
ఇదంతా ఫ్లైఓవర్ మధ్యలో అందరూ చూస్తుండగానే జరిగిన ఘటన. అటుగా వెళ్తున్న వాహనదారులు తమ వాహనాలను ఆపి దుండగులను ఆపే ప్రయత్నం చేయాలనుకున్నారు. కానీ వారి చేతిలో తుపాకీ ఉండటాన్ని చూసి వెనుకడుగు వేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగులు వ్యాపారికి తెలిసిన వ్యక్తులే అయి ఉంటారని, డబ్బుతో వస్తున్నట్లు తెలుసుకుని దోపిడీ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.