Home జాతీయం కుర్చీలో ఎవరు కూర్చోవాలనేది 125కోట్ల ప్రజలు నిర్ణయం

కుర్చీలో ఎవరు కూర్చోవాలనేది 125కోట్ల ప్రజలు నిర్ణయం

372
0

న్యూఢిల్లీ : ”కుర్చీలో ఎవరు కూర్చోవాలనేది125కోట్ల ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నన్ను కూర్చోబెట్టారు.” అంటూ ప్రధాని మోదీ అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం జరిగిన సుదీర్ఘ చర్చకు సమాధానమిచ్చారు. దాదాపు గంటన్నరకు పైగా మోదీ సమాధానమిచ్చారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యనే ప్రధాని సమాధానం కొనసాగించారు. ఒకవైపు ప్రభుత్వ పథకాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ మరో వైపు విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ అవిశ్వాస తీర్మానంపై ఆటోమేటిక్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. వాయిస్ ఓటును పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో బటన్స్ నొక్కడం ద్వారా తెలియజేసే విధానంలో ఓటింగ్ నిర్వహించారు. దశాబ్దన్నర తర్వాత లోక్‌సభలో చేపట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 సభ్యులు మద్దతు పలకగా, 325 మంది ఎంపీలు వ్యతిరేకంగా నిలవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.

మోదీ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అందరికి బీమా, రైతుల్లో భరోసా నింపడానికి కిసాన్ భరోసా వంటి పథకాలను వివరించారు. త్వరలోనే ఆయుష్మాన్ భారత్ ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. అంతకు ముందు చర్చలో పాల్గొన్న సభ్యులు లేవనెత్తిన అంశాలను ప్రస్తావిస్తూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రసంగ సమయంలో చంద్రబాబు తమకు మిత్రుడని అన్నప్పుడు కిమ్మనకుండా ఉండిపోయిన టీడీపీ ఎంపీలు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు డైరెక్షన్‌లో మరో డ్రామాకు తెరలేపారు. ప్రధాని మోదీ ప్రసంగం చేస్తుండగా పోడియం వద్ద కొద్దిసేపు నిరసన నినాదాలు చేశారు. మోదీ తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తెస్తూ టీడీపీ నేతల లాలూచీ వ్యవహారాలను బయటపెట్టారు.