Home జాతీయం సివిల్స్ లో తెలుగు తేజాలు

సివిల్స్ లో తెలుగు తేజాలు

507
0

– తెలంగాణ కుర్రాడు నంబరు వన్‌
– సివిల్స్‌ పరీక్షల్లో మొదటి ర్యాంకులో మెట్‌పల్లికి చెందిన అనుదీప్‌
– ఐదో ప్రయత్నంలో ఖమ్మం యువకుడు శ్రీహర్షకు ఆరో ర్యాంకు
– సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడికి 196వ ర్యాంకు
– దేశవ్యాప్తంగా సివిల్‌ సర్వీసులకు 990 మంది ఎంపిక

హైదరాబాద్‌: సివిల్‌ సర్వీసుల పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చూపారు. తెలంగాణ కుర్రాడు దురిశెట్టి అనుదీప్‌ జాతీయ ప్రధమ ర్యాంకు సాధించాడు. గతంలో ఇదే పరీక్షల్లో సాధారణ ర్యాంకుతో రెవెన్యూ సర్వీసుల్లో సహాయ కమిషనర్‌గా చేరిన ఇతను పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ ప్రయత్నించి దేశవ్యాప్తంగా అందరికంటే ముందు నిలిచాడు. తెలంగాణకే చెందిన కోయ శ్రీహర్ష సైతం ఆరోర్యాంకు సాధించాడు. మొత్తం 990 మందిని వివిధ సర్వీసులకు ఎంపిక చేసినట్లు బుధవారం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(యూపీఎస్సీ) విడుదల చేసిన ఫలితాల్లో పేర్కొంది. అనుకుమారి, సచిన్‌ గుప్తా వరుసగా రెండు, మూడో ర్యాంకులు పొందారు. మహిళల్లో అగ్రగామిగా నిలిచిన కుమారి దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో బీఎస్సీ(ఆనర్స్‌) పూర్తి చేశారు. నాగ్‌పుర్‌లోని ఐఎంటీ నుంచి ఎంబీయే(ఫైనాన్స్‌, మార్కెటింగ్‌) అభ్యసించారు. దివ్యాంగురాలైన సౌమ్యశర్మ తొమ్మిదో ర్యాంకు సాధించారు. తొలి 25 ర్యాంకుల్లో 8 మంది యువతులు, 17 మంది పురుషులు ఉన్నారు. పరీక్ష ఫలితాలను యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌ ‌www.upsc.gov.in లో చూడవచ్చు.

మొత్తం 9.50 లక్షల మంది ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేశారు. వీరిలో 13,000 మంది మెయిన్స్‌ పరీక్షలు రాశారు. మెయిన్స్లో మంచి మార్కులు సాధించిన 2475 మందిని మౌఖిక పరీక్షలకు ఎంపికయ్యారు. మొత్తం 990 మందిలో 476 మంది జనరల్‌ కేటగిరీలో ఎంపికయ్యారు. మొత్తం 180 మందిని ఐఏఎస్‌కు ఎంపిక చేయగా వీరిలో జనరల్‌ కేటగిరీలో 93 మంది, ఓబీసీలో 46, ఎస్సీలు 28, ఎస్టీలు 13 మంది ఉన్నారు. ఐపీఎస్‌కు 150 మంది ఎంపికవ్వగా జనరల్‌ కేటగిరీలో 77 మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కోయ శ్రీహర్షకు 6, శీలం సాయితేజకు 43వ ర్యాంకు సాధించారు. విశ్రాంత ఐపీఎస్‌ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్‌ 196వ ర్యాంకులో నిలిచాడు.