న్యూదిల్లీ : కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ అధికారం చేపట్టిన తర్వాత పెట్రోల్ ధరలు తొలిసారి రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.74.04కు చేరింది. డీజిల్ ధర ఏకంగా లీటరు రూ.65.65కు పెరిగి ఆల్‌టైమ్ రికార్డు ధరను నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ ధరలు పెరిగినప్పుడు దేశంలో పెట్రోలు ధరలు పెంచుతున్న ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారల్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఎందుకు తగ్గించడంలేదు? ఈ ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పడంలేదు. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని పెట్రోలు ధరలు స్థిరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదీనంలో ఉన్న ఆయిల్‌పూల్‌ను రద్దు చేసి రోజువారీ ధరల పెరుగుదలకు బిజెపి తీసుకున్న నిర్ణయమే కారణమైంది.
గతేడాది జూన్ నుండి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు రోజు వారీగా పెట్రోలు ధరల సవరిస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు పెట్రోల్ ధర 19 పైసలు పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో శనివారం పెట్రోల్‌పై 13 పైసలు, డీజిల్‌పై 15 పైసలు పెంచారు. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర 74.40కు చేరింది. 2013 సెప్టెంబరు 14 తర్వాత ఇదే అత్యధిక ధర కావడం విశేషం. అప్పుడు లీటరు పెట్రోల్ ధర రూ.76.06గా ఉంది. ఇక డీజిల్ ధర అత్యధికంగా రూ.65.65కు చేరింది.
పెరుగుతున్న పెట్రోల్ ధరల భారం వినియోగదారులపై పడకుండా ఉండాలంటే ఎక్సైజ్ డ్యూటీలో కోత విధించడమే మార్గమని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ ఏడాది క్రితం సూచించింది. అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆ ప్రతిపాదనలను తోసి పుచ్చారు. 2014 నవంబరు, 2016 జనవరి మధ్యకాలంలో ఆర్థిక మంత్రి మొత్తం తొమ్మిదిసార్లు ఎక్సైజ్ డ్యూటీని పెంచారు. అయితే కేవలం గతేడాది అక్టోబరులో మాత్రం ఒకే ఒకసారి రూ.2 తగ్గించారు.
మరోపక్క పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరుతోంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లు మాత్రమే వ్యాట్‌ను తగ్గించగా, మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం వినతిని అసలు పట్టించుకోలేదు. గతేడాది అక్టోబరులో ఎక్సైజ్ డ్యూటీని రూ.2తగ్గించడంతో దిల్లీలో లీటరు ప్రెటోల్ ధర రూ.70.88 చేరగా, డీజిల్ రూ.59.14కు చేరింది.