ఒంగోలు : తండ్రి మంగళి షాపులో పనిచేస్తాడు. తల్లి కూలీ పనులు చేసుకుంటూ 10ఏళ్ల కొడుకును ఆంద్రా పబ్లిక్ స్కూల్‌లో 2వ తరగతి చదివిస్తున్నారు. తండ్రి షాపుకు వెళ్లిన అనంతరం సెల్‌ఫోన్ తీసుకున్న బాలుడు ఆడుకుంటున్నాడు. ఆడుకునే సమయంలో చేతిలో సెల్‌ఫోన్ జారిపడింది. సెల్ పగిలిపోయింది. అంతే తండ్రి ఇంటికొస్తే సెల్ పగిలిపోయిందని కొడతాడన్న భయంతో బాలుడు ఇంటి నుండి పారిపోయాడు. ఒంగోలు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఒంగోలు – తెనాలి పాసింజర్ రైలు ఎక్కాడు. రైలులో బాలుడు వంటరిగా ప్రయాణం చేయడం గమనించిన తోటి ప్రయాణికులు బాలుడిని దగ్గరికి తీసుకుని వంటరిగా ఎక్కడికి వెళుతున్నావు, ఎందుకు వంటరిగా వెళుతున్నావు, తల్లిదండ్రులు ఎవ్వరు, ఎక్కడ చదువుతున్నావంటూ వివరాలు సేకరించారు. ఒంగోలు ఆంద్ర పబ్లిక్ స్కూల్‌లో రెండో తరగతి చతున్నట్లు చెప్పాడు. తండ్రి మంగళి షాపులో పనిచేస్తాడని, తల్లి కూలీ పనులకు వెళుతుందని చెప్పాడు.
తండ్రి బయటికెళ్లినప్పుడు సెల్‌ఫోన్‌తో ఆడుకుంటూ పగలగొట్టానని చెప్పాడు. తండ్రి ఇంటికొస్తే కొడతాడన్న భయంతో పారిపోయి రైలు ఎక్కినట్లు చెప్పడంతో అదివిన్న ప్రయాణికులు చైల్డ్‌లైన్ 1098నంబరుకు సమాచారం ఇచ్చారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి టి రాజావెంకటాద్రికి సమాచారం ఇచ్చారు. జడ్జి పారాలీగల్ వాలంటీర్ బివి సాగర్‌కు సమాచారం ఇచ్చి బాలుడిని తల్లిదండ్రుల వివరాలు సేకరించాలని ఆదేశించారు. బాలుని ఆచూకీ తెలుసుకోవాలని చెప్పారు. అప్పటికే రైలు చిన్నగంజాం దాటడంతో చీరాల జిఆర్‌పి ఎస్ఐ జి రామిరెడ్డికి సమాచారం ఇచ్చి రైలులో వంటరిగా ఉన్న బాలుడిని స్వాదీనం చేసుకున్నారు. బాలుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాలుని ఆచూకీ కోసం ఒంగోలు పట్టణమంతా వెతికిన ఆ తల్లిదండ్రులు ఆ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన చీరాల రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.