చీరాల : ఇంజనీరింగ్ విద్యార్ధులకు శిక్షణ – నియామకాలు అంశంపై సదస్సు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. యలమంచిలి సాప్ట్‌వేర్ ఎక్స్‌స్పోర్ట్స్ వ్యవస్థాపకులు, సిఇఒ యలమంచిలి రామకృష్ణ విద్యార్ధులకు వివిధ అంశాలను వివరించారు. ఇంజనీరింగ్ ముగిసే నాటికి తాము ఇంజనీర్లమని అత్యంత ఉత్సాహంతో కళాశాల నుండి కోర్సు పూర్తి చేసుకుని బయటికి వస్తారని చెప్పారు. కానీ చదువుకున్న కోర్సుకు తగిన ఉద్యోగం కోసం పోటీ ప్రపంచంలో వెతుక్కోవాల్సి వస్తుందన్నారు. కంపెనీల అవసరాలు విద్యార్ధుల సిలబస్‌కు భిన్నంగా ఉన్నాయన్నారు. అందువల్ల విద్యార్ధులు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాలలో వేలకు వేలు ఖర్చు చేసి అక్కడి హాస్టళ్లలో ఉండి కంపెనీల అవసరాలకు అనువైన కోర్సులు నేర్చుకోవాల్సి వస్తుందన్నారు.
ఇంజనీరింగ్ చదివే విద్యార్ధులపై ప్రభుత్వం వేలల్లో ఖర్చు చేస్తుందని చెప్పారు. రూ.500ఫీజుతో ఇంజనీరింగ్ చదివే అవకాశం ప్రభుత్వం ఇచ్చిందన్నారు. చదువు పూర్తి చేశాక విదేశాలకు వెళ్లడం కాకుండా ఇక్కడే కంపెనీలు ప్రారంభించి దేశాభివృద్దికి దోహదపడాలని సూచించారు. అదే ఉద్దేశంతో తాను 1998లో కంపెనీ ప్రారంభించినట్లు తెలిపారు. సామాజిక బద్రత దృష్టితో తాము తయారు చేసిన సాప్ట్వేర్‌లను దేశంలోని వివిధ బ్యాంకులకు ఉచితంగా ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్, టిపిఒ ఎన్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.