Home ప్రకాశం అక్కచెల్లెమ్మలకు జగన్‌ నమ్మకద్రోహం : ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ ఆరోపణలు

అక్కచెల్లెమ్మలకు జగన్‌ నమ్మకద్రోహం : ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ ఆరోపణలు

90
0

అద్దంకి (Addanki) : చేయూత, ఆర్ధిక సహాయం పేరుతో అక్క, చెల్లెమ్మలను సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి (CMYS Jaganmohan Reddy) నమ్మద్రోహం చేశాడని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ (MLA Gottipati Ravikumar)  ఆరోపించారు. పట్టణంలో వివిధ కార్యక్రమాలకు హాజరైన ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. స్థానిక నేతలతో మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని కూడా రాష్ట్రంలో మహిళలు ఆనందంగా జరుపుకునే పరిస్థితి లేదని అన్నారు. మాటల్లో నా అక్కచెల్లెమ్మలంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పే జగన్‌రెడ్డి చేతల్లో మహిళలను నట్టేట ముంచుతున్నాడని ఆరోపించారు. అనకాపల్లిలో చేయూత 4వ విడత నిధుల విడుదల సందర్భంగా సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలను ఉద్దరించినట్లు ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటని అన్నారు. ఎన్నికలకు ముందు చేయూత పథకం కింద 45ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రూ.3వేల చొప్పున పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పెన్షన్ ఇవ్వకపోగా ఐదేళ్లకు కలిపి రూ.75వేలు ఆర్థికసాయమని మడమ తిప్పడం వాస్తవం కాదాని ప్రశ్నించారు. జగన్ రెడ్డి చేసిన మోసంతో ఇప్పటివరకూ ఒక్కో మహిళకు రూ.1.05లక్షల చొప్పున నష్టం జరిగిందని తెలిపారు. ఇది మహిళలను మోసం చేయడం కాదా జగన్ రెడ్డీ? అని ప్రశ్నించారు. మహిళలను తోబుట్టువుల్లా చూసి మహిళలకు ఆస్తిలో సగభాగం హక్కు కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం (Telugudesham) అని అన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపి, ఆర్థిక స్వాలంబనకు నిరంతరం టిడిపి పనిచేస్తుందని తెలిపారు. మహిళా సంక్షేమానికి ఈ ఐదేళ్లలో జగన్‌రెడ్డి చేసింది శూన్యమని అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు చంద్రబాబు అమలు చేసిన అనేక పథకాలను రద్దు చేసిన జగన్‌ మహిళా ఉద్ధారకుడిగా మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. పిన్నమ్మ తాళి తెంచిన నరహంతకుల్ని రక్షిస్తున్న జగన్‌రెడ్డి మహిళా ద్రోహి కాదా? అని అన్నారు. చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వని జగన్‌రెడ్డి మోసగాడు కాదా? అని ప్రశ్నించారు. సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేని జగన్‌రెడ్డి రాష్ట్రంలోని ఆడబిడ్డలను ఉద్దరిస్తాడా? అని అన్నారు. జీతాలు పెంచమని వేడుకున్న అంగన్‌వాడీ, ఆశా వర్కర్లను పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం, ఎపీని అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చడం మహిళల పట్ల జగన్‌రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. జగన్‌రెడ్డి చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని మహిళలే గద్దె దించుతారని గొట్టిపాటి పేర్కొన్నారు.