కాల్వశ్రీరాంపూర్ : ఆధునిక సమాజం. క్షణాల్లో సమాచారం ప్రపంచాన్ని చుట్టేస్తుంది. భూగర్భలోతుల్లో, సముద్రగర్భంలో, ఆకాశంలో ఎక్కడైనా ఏముందో విప్పి చూడగల సాంకేతిక అభివృద్ది చెందిన రోజుల్లో కూడా నరబలి ఇస్తే గుప్త నిధులు దొరుకుతాయన్న దురాశ, మూఢ విశ్వాసం వేళ్లూనుకుని ఉందనేందుకు ఇదో పెద్ద ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లిలో గుప్తనిధుల తవ్వకాల కోసం నరబలికి యత్నించిన ఘటన శనివారం చోటు చేసుకుంది.
అదే మండలం కిష్టంపేట గ్రామస్థుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన సాగర్ల రవి అదే గ్రామానికి చెందిన గాదర్ల రమేష్ అనే యువకుడిని పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్దామని చెప్పి శనివారం రాత్రి మొట్లపల్లి శివారులోని మానేరు ఒడ్డున ఉన్న సుంకరికోటల వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ మరికొంత మంది మద్యం సీసాలతో ఉన్నారు. నరబలి చేసేందుకు వారు రమేష్‌ను మద్యం తాగాలని ఒత్తిడి చేశారు. కాగా పక్కనే గుప్తనిధుల కోసం తవ్విన గుంత, నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, ఇతర మారణాయుధాలను చూసిన రమేష్ భయాందోళనకు గురయ్యాడు. అక్కడి నుండి తప్పించుకుని మొట్లపల్లికి చేరుకున్నాడు. అతడిని దొంగగా భావించిన గ్రామస్థులు ప్రశ్నించగా తన వివరాలను చెప్పి కిష్టంపేటలోని కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. ఆదివారం ఉదయం రమేష్‌తోపాటు గ్రామస్థులు సుంకరి కోటల వద్దకు వెళ్లేసరికి అక్కడి గుడిసెలో గుప్త నిధుల ముఠా కనిపించింది. గ్రామస్థులను చూసి కొందరు ముఠా సభ్యులు పారిపోగా సాగర్ల రవితో పాటు మరో ముగ్గురిని గ్రామస్థులు నిర్బంధించారు. వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.