చెన్నై: నేను అన్నింటి కంటే ఎక్కువగా ఇష్టపడేది దేన్నో తెలుసా? ఎంత ఇష్టమో తెలుసా? అటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. చాలా మంది కథానాయికల మాదిరిగానే కోటి ఆశలతో కోలీవుడ్‌కు బొమ్మలాట్టం చిత్రంతో పరిచయమైంది ఈ ఉత్తరాది బ్యూటీ. ఆ తరువాత భరత్‌కు జంటగా నటించిన పళని లాంటి చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో ఐరన్ లెగ్ అనే ముద్రను వేయించుకుంది. ఆతర్వాత టాలీవుడ్‌కు దగ్గరైంది. అక్కడే కాజల్ దశ తిరిగింది.
అక్కడి నుండి మళ్లీ కోలీవుడ్‌లో విజయ్‌తో తుపాకీ, జిల్లా చిత్రాల్లో నటించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అయ్యింది. ఇటీవల అజిత్‌కు జంటగా నటించిన వివేకం, విజయ్‌తో నటించిన మెర్శల్ చిత్రాలు కూడా విజయం సాధించాయి. ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అలా కాజల్ తన స్టార్ ఇమేజ్‌ను నిలబెట్టుకుంటూ వస్తోంది. తాజాగా తెలుగులో నటించిన ‘అ’ చిత్రం హిట్ టాక్‌ను తెచ్చుకోవడంతో కాజల్ ఫుల్‌జోష్‌లో ఉంది. కోలీవుడ్‌లో ప్రస్తుతం ప్యారిస్ ప్యారిస్ అనే చిత్రంలో నటిస్తోంది. హిందీలో కంగనారావత్ నటించిన క్వీన్ చిత్రానికి రీమేక్ ఈ చిత్రం అన్నది తెలిసిందే.
ఈ చిత్రంపై కాజల్ చాలా ఆశలు పెట్టుకుందట. ఆవార్డులను కూడా ఆశిస్తున్నట్లు ఇటీవల ఒక భేటీలో పేర్కొంది. ఆమె చెల్లెలు నిషాఅగర్వాల్ కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాకపోవడంతో పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిలైపోయింది. దీంతో మీ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు కాజల్ బదులిస్తూ తానూ కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. అదీ సరైన సమయంలో కరెక్ట్‌గా జరుగుతుందట. అయితే వివాహానంతరం తాను నటనకు దూరం కానని పేర్కొంటుందీ భామ. అన్నింటికంటే తాను అధికంగా ప్రేమించేది నటననేనని కాజల్ స్పష్టంగా చెప్పింది. నటనంటే తనకెంతిష్టమో వివరిస్తుంది.