చీరాల : చేనేతల సంక్షేమం కోసం వైఎస్ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటున్నట్లు వైసిపి చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు చిల్లంపల్లి మోహనరావు పేర్కొన్నారు. చీరాల పర్యటనకు వచ్చిన ఆయన వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి యడం బాలాజితో కలిసి పార్టీ కార్యాలయంలో శనివారం విలేకర్లతో మాట్లాడారు. ధర్మవరం, మంగళగిరి వంటి ప్రాంతాల్లో చేనేతలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడి చేనేత వృత్తి సమస్యలు తెలుసుకున్న వైసిపి అధినేత వైఎస్ జగన్ చేనేతల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో చేనేతల ఓట్ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. చేనేత వృత్తి రక్షణకు రూ.వెయ్యి కోట్ల మూలధనం ఏర్పాటు చేస్తామన్న హామీని అటకెక్కించారని చెప్పారు. వర్క్‌షెడ్డుతో కూడిన ఇళ్లు కట్టిస్తామన్న ఆహామీ ఏమైందో ముఖ్యమంత్రికే తెలియాలని చెప్పారు. ఇలా వరుసగా చేనేతలకు ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు గాలికొదిలేశారని ఆరోపించారు. చేనేత వృత్తిలో కార్మికుల స్థితిగతులు చూసిన జగన్ 45సంవత్సరాలకే చేనేతలకు పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. వైఎస్ఆర్‌సిపి అధికారానికి వస్తే చేనేత కార్పోరేషన్ ఏర్పాటు చేసి చేనేత కార్మికుల అభివృద్దికి రుణాలు మంజూరు చేస్తారని చెప్పారు. వైసిపి నవరత్నాల పథకాల్లో చేనేతను కూడా చేర్చినట్లు చెప్పారు. చేనేత వృత్తిపై కేంద్ర ప్రభుత్వం విధించిన జిఎస్‌టి రద్దు చేయాలని కోరారు. చేనేత కార్మికులకు ఆస్థి పన్ను రద్దు చేస్తామన్న చంద్రబాబు చేనేత ప్రాంతాలను కమర్షియల్ ప్రాంతాలుగా మార్చి అధిక పన్నులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈసందర్భంగా వైసిపి చేనేత విభాగం జిల్లా అధ్యక్షులుగా కర్ణ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కందుల సూర్యప్రకాశరావులను నియమించినట్లు నియామక పత్రాలు అందజేశారు. చేనేతల సంక్షేమం కోసం వైసిపి అధికారానికి వచ్చిన అనంతరం చేనేతలకు అనుకూలమైన పథకాలు అమలు చేస్తుందని వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి యడం బాలాజి పేర్కొన్నారు. ఈనెల 8, 10, 11తేదీల్లో వైసిపి అధినేత ప్రజాసంకల్ప యాత్ర చీరాల నియోజకవర్గంలో జరుగుతుందని పేర్కొన్నారు. చేనేతలు, వైసిపి కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. 11న ఈపూరుపాలెంలో చేనేతల సమస్యలపై జగన్ సదస్సు నిర్వహిస్తారని తెలిపారు. సమావేశంలో చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి బీరక సురేంద్ర, గిరిరాజ నగేష్, వైసిపి జిల్లా కార్యదర్శి గోలి అంజలీదేవి, మంగళగిరి వైసిపి కార్యదర్శి మునగాల మల్లేశ్వరరావు, చేనేత విభాగం ప్రచార కార్యదర్శి ఊట్ల సాంబశివరావు, వేటపాలెం అధ్యక్షులు కొలుకుల వెంకటేష్, మహిళాధ్యక్షులు పింజల శారదాంబ, గోలి వెంకట్రావు, డి బాబురావు, వైసిపి పట్టణ అధ్యక్షులు బొనిగల జైసన్‌బాబు పాల్గొన్నారు.