Home ప్రకాశం ఉద్యోగాలు ఇవ్వకుండా యువ నేస్తమా ? : రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టిన ఎమ్మెల్యే జంకె,...

ఉద్యోగాలు ఇవ్వకుండా యువ నేస్తమా ? : రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టిన ఎమ్మెల్యే జంకె, రామనాధం బాబు

486
0

ఒంగోలు : గ‌త‌ నాలగున్నరేళ్ల నుండి ఖాళీగా ఉన్న 2.12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా, ఏదో నాలుగు నెలలపాటు నాలుగు వేలిస్తే యువ నేస్తమెలా అవుతుందని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించారు. బుధవారం సాయంత్రం ఆయ‌న‌ ఒంగోలు వచ్చారు. కలెక్టరేట్‌ ఎదుట రెండోరోజు నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజంగా యువకుల పక్షాన నిలవాలనుకుంటే నాలుగున్నరేళ్ల నుండి రెండు వేలు చొప్పున భృతి ఇచ్చి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. నాడు ప్రత్యేక హోదాకు గండికొట్టినందు వల్ల పరిశ్రమలు రాక నిరుద్యోగం పెరిగిందన్నారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయకుండా యువతను చంద్రబాబు మోసం చేస్తున్నాడని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వచ్చేది జగన్‌ మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. తమ ప్రభుత్వం వస్తే యువత ఉపాధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుందని చెప్పారు.

పర్చూరు సమన్వయకర్త రావి రామనాధం బాబు దీక్షలో పాల్గొన్నవాళ్లనుద్దేశించి మాట్లాడుతూ నిరుద్యోగ భృతి అంతా బూటకమని అన్నారు. కేవలం ఎన్నికల్లో గట్టెక్కేందుకు మాత్రమే చంద్రబాబు ఇలాంటి జిమ్కిక్కులు చేస్తుంటారని చెప్పారు. నిజంగా ఆయనకు నిరుద్యోగ యువతను ఆదుకోవాలనుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. ఇచ్చే అరకొర భృతికీ సవాలక్ష నిబంధనలు విధించినట్లు తెలిపారు. యువత ఆలోచించి రానున్న ఎన్నిక‌ల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించాలని కోరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్‌ రెడ్డి దీక్షలోని విద్యార్థి నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ప్రణీత్‌ రెడ్డి యువకులకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కుప్పం ప్రసాద్‌, జడా బాలనాగేంద్రం, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రెండోరోజు దీక్షలో వైసిపి విద్యార్ధి నాయ‌కులు రేలా అమర్నాధ్‌రెడ్డి, కందుల రాజశేఖర్‌, షేక్‌ ఆరిఫ్‌, ముజకిల్‌, యశ్వంత్‌ వర్మ, తాటిపర్తి సాయిరెడ్డి, దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, యాతం క్రాంతి కుమార్‌, మాచవరపు రవికుమార్‌, దొడ్డు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.