కొండేపి : నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సిపి రాజకీయాలు వేడెక్కాయి. గత కొంతకాలంగా రెండు గ్రూపులుగా నడుస్తున్న వైసిపిలో వివాదాన్ని అధినేత సైతం పరిష్కరించలేని స్థితికి చేరుకుంది. జిల్లాస్థాయి నేతల మద్య ఉన్న పోరులో కొండేపి నియోజకవర్గంలో ఇన్‌ఛార్జిగా ఉన్న వరికూటి అశోక్‌బాబును మార్చడంతో వివాదం ముదిరింది. నాలుగేళ్లు పార్టీని నిర్మించుకుని ఎన్నికలకు సిద్దమైన అశోక్‌బాబును మార్చడంపట్ల ఆయన వర్గీయుల్లో సైతం పట్టుదల పెంచింది. అవసరమైతే స్వతంత్ర అభ్యర్ధిగానైనా నిలబెట్టి గెలిపించుకుంటామని కార్యకర్తలే ప్రకటించే పరిస్థితి ఏర్పడింది. పార్టీ కార్యకర్తలు, మండల, గ్రామస్థాయి కమిటీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు అశోక్‌బాబు వెంట ఉండటంతో పార్టీ సమన్వయకర్తగా మాదాసి వెంకయ్యను ప్రకటించినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలోనే వరికూటి అశోక్‌బాబు వైఎస్ఆర్‌సిపి యువజన విభాగం నియోజకవర్గ సదస్సు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో యువతను కూడగట్టి కొండేపిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
వైయస్సార్ సిపి యువజన విభాగ సదస్సు ప్రారంభానికి ముందు వైసిపి ఆఫీసు నుండి ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ లోని వైయస్సార్ విగ్రహంతో పాటు జాతీయనాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సదస్సులో వైసిపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఢాకా పిచ్చి రెడ్డి, ఆరుమండలాల వైసిపి అధ్యక్షులు ఆరికట్ల వెంకటేశ్వర్లు, దద్దాళి మల్లికార్జున, మల్లవరపు రాఘవరెడ్డి, పాటిబండ్ల నాగేశ్వరరావు, కోమట్ల రాజశేఖర్ రెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.