Home ఆంధ్రప్రదేశ్ హ‌జీస్‌పురం నుండి ప్రారంభ‌మైన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌

హ‌జీస్‌పురం నుండి ప్రారంభ‌మైన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌

509
0

– జ‌గ‌న్‌ను క‌లిసిన పొగాకు రైతులు
– తాము పెంచిన చేపలను దౌర్జన్యంగా పట్టుకెళ్లార‌ని వాపోయిన జాల‌ర్లు
– మ‌న ప్ర‌భుత్వం వ‌స్తే ఆదుకుంటామ‌న్న జ‌గ‌న్‌

క‌నిగిరి : పొగాకు సాగుచేసిన‌ప్ప‌టికీ గిట్టుబాటు కాక పెట్టిన పెట్టుబ‌డులు కూడా రావ‌డంలేద‌ని పొగాకు రైతులు ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. 96వ రోజు ప్ర‌జాసంక‌ల్ప యాత్ర క‌నిగిరి మండ‌లం హ‌జీస్‌పురం నుండి ప్రారంభించారు. పొగాకు రైతులు స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్ ఆల‌కించారు.

మోపాడు రిజ‌ర్వాయ‌ర్‌లో (చెరువు) తాము కష్టపడి పెంచిన చేపలను అధికారం అండతో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా పట్టుకెళ్లారని పీసీపల్లి, కనిగిరి మండలాలకు చెందిన జాలర్లు జ‌గ‌న్‌వ‌ద్ద‌ గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామాల్లో అధికార పార్టీ నేతల దౌర్జన్యం శ్రుతిమించాయ‌ని చెప్పారు. తమ కడుపుకొట్టే దాకా టిడిపినేత‌ల దౌర్జ‌న్యం వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.

పామూరు మండలం మోపాడు, పామూరు, నుచ్చుపొద గ్రామాలకు చెందిన యానాది కుటుంబాల్లోని మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాదయాత్ర సాగుతున్న ప్రాంతానికి వచ్చి జగన్‌ను కలిశారు. నుచ్చుపొద జాలర్ల సహకార సంఘం పరిధిలోని ఎనిమిది చెరువుల్లో పెంచుకున్న రూ.కోట్ల విలువైన చేపలను ఎమ్మెల్యే అనుచరులు పట్టుకొని అమ్ముకున్నారని ఆరోపించారు.

తమ ఇళ్ల వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మోపాడు (రిజర్వాయర్‌) చెరువులో గత ఆగస్టులో రూ.కోటిన్నర విలువైన చేపలను పట్టుకుపోయారని చెప్పారు. తమ సంఘం పరిధిలో ఉండే మరో ఏడు చెరువుల్లో ఇప్పుడు రూ.4కోట్ల విలువైన‌ చేపలు ఉన్నాయని చెప్పారు. టీడీపీ నేతలు వాటిని కొట్టేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యం, అక్రమాలపై బహిరంగ విచారణ జరిపించాలని జాల‌ర్లు కోరారు.

పీసీపల్లి మండలం రామాపురం వద్ద గొర్రెల కాపరులు జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. గొర్రెల కాపరులకు గ‌త‌ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేదని.. ఈ ప్రభుత్వంలో గొర్రెలకు బీమా సౌకర్యాన్ని అమలు చేయడం లేదని కాప‌రులు జగన్‌కు వివరించారు. స‌మ‌స్య‌ల‌న్నీ విన్న జ‌గ‌న్ మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు.