చీరాల : మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటేనే కుటుంబ జీవనం ఆరోగ్యకరంగా ఉంటుందని రక్షణ సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్జా శివశంకర్ పేర్కొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వాడరేవులో గురువారం జరిగిన మహిళా దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఎయిడ్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ సహకారంతో రక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. మహిళా బద్రత, మహిళా సాధికారత, మహిళల ఆరోగ్యమే దేశ ప్రగతికి సౌభాగ్యం నినాదాలతో ప్లేకార్డులు ప్రదర్శనలో పట్టుకున్నారు. ర్యాలీని న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ ఎన్ కృష్ణన్‌కుట్టి జెండా ఊపి ప్రారంభించారు.
సభాధ్యక్షత వహించిన శివశంకరర్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం ప్రధానమైదన్నారు. పునరుత్పత్తి, హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి నిరోధానికి, లైంగిక చర్యల ద్వారా సంక్రమించే సుఖవ్యాధులు, అవాంచిత గర్భాలకు సంబంధించిన జాగ్రత్తలపై మహిళల్లో చైతన్యం రావాలన్నారు. న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, న్యాయమూర్తి ఎన్ కృష్ణన్‌కుట్టి మాట్లాడుతూ వరకట్న వేధింపులు, గృహహింస నిరోధక చట్టం పరిధిలో వచ్చే కేసుల్లో నిజాయితీ ఉండాలన్నారు. ఎవరైతే హింసించారో వారిపైనే ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందన్నారు. అలా కాకుండా కుటుంబ సభ్యులందరిపై కేసులు పెడితే ఫలితం ఉండదన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు అక్కిశెట్టి పుల్లయ్య మాట్లాడుతూ అక్రమంగా విదేశాలకు రవాణా చేయబడి, విదేశాల్లో లైంగిక వేధింపులకు గురై తిరిగి వచ్చిన వారి ద్వారా హెచ్ఐవి వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. అక్షరాస్యత ద్వారా మహిళలు చైతన్యం కావాలని చెప్పారు.
న్యాయవాది టి శారద మాట్లాడుతూ ప్రతిఒక్కరు వివాహ రుజువులు చూపి రిజిస్టర్ చేయించుకోవాలని చెప్పారు. భర్తతో వివాదం వచ్చినప్పుడు ఆర్ధిక రక్షణ పొందేందుకు దోహదపడతాయని చెప్పారు. బాలికలు ఎదుటి వ్యక్తులను నమ్మడం ద్వారానే మోసపోతుంటారని న్యాయవాది డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ద్వారా మాత్రమే మహిళలకు కొంతమేరకైనా రక్షణ ఉంటుందన్నారు. ఈసందర్భంగా సుమారు 100మందికిపైగా మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో రక్షణ సంస్థ కోఆర్డినేటర్ రాము, న్యాయవాదులు టి శంకుంతల, రామకృష్ణ, పి దయారావు, ఇ మహేష్, మాల్నిదేవి, శరత్‌బాబు, ప్రసాద్, హరిద్ర, రాజకిరణ్, ప్రభుత్వ వైద్యశాల ఎఆర్‌టి బిందు పాల్గొన్నారు.