చీరాల : చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ నిర్వహించారు. సభలో నెల్లూరు డివిజన్ వస్తు, సేవల పన్నుల శాఖ డిప్యూటి కమీషనర్ దాసరి నాగక్ష్మి మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న అనేక అంశాలను విద్యార్ధులకు వివరించారు. తన గమ్యం చిన్నతనం నుండి ప్రభుత్వం ఉద్యోగస్థురాలు కావాలన్న కలను ఉన్న ఊరిలోనే, ఉన్న అతి తక్కువ సౌకర్యాలతోనే కృషి, పట్టుదలతో సాధించగలిగినట్లు చెప్పారు. తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. కష్టపడి జీవించే ప్రతిఒక్కరికి దైవ అనుగ్రహం ఉంటుందన్నారు. నేటి సమాజంలో అతిచిన్న కారణాలకు సమస్యలకు జీవితాన్ని ఫణంగా పెట్టి ఆత్మహత్యలకు పాల్పడటం సరైన పద్దతి కాదన్నారు.
జీవితంలో చదువుతోపాటు అనేక రంగాలలో అవకాశాలు, అనేక దేశాలలో ఉన్నాయని చెప్పారు. అనుకున్న గమ్యాన్ని చేరుకోవడంలో నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సామాజిక జీవితం, వృత్తిపరమైన జీవితం ఉంటాయన్నారు. అందానికన్నా వ్యక్తి వైఖరి ముఖ్యమన్నారు. మానసిక ఉల్లాసానికి, శారీరక ఉల్లాసం కారణమని చెప్పారు. మంచి అనుబంధాలు, సంతోషకరమైన వాతావరణాన్ని మనం తయారు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆమెను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ తేళ్ల అశోక్‌కుమార్, ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ ఎన్ సురేష్, అధ్యాపకులు బి రాధ, పావని, పి సత్యనారాయణ, డి శ్రీధర్‌కుమార్ పాల్గొన్నారు.