అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదనే సమాచారం కేంద్ర ఆర్థికశాఖ నుండి లీకైంది. ఈనేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి టిడిఎల్‌పి సమావేశం నిర్వహించారు. డిల్లీలో పరిణామాలపై మీడియాలో వచ్చిన తాజా అంశాలను చంద్రబాబు టీడీఎల్పీ సమావేశంలో చదివి విన్పించినట్లు సమాచారం. సమస్యను కేంద్రం ఇంకా ఎందుకు జఠిలం చేస్తుందో తనకు అర్థం కావడం లేదని బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని అన్నట్లు తెలిసింది. అంతేకాకుండా టీడీఎల్పీలో మూడురకాల ప్రశ్నలతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను సీఎం కోరడంతో భిన్నమైన ప్రతిపాదనలు వచ్చాయని సమాచారం. కొంతకాలం వేచిచూద్దామా? లేదా పోరాటం కొనసాగిస్తూ ఒత్తిడి పెంచుదామా? అని చంద్రబాబు ప్రశ్నించగా తెగదెంపులు చేసుకొనేలా తక్షణమే కీలక నిర్ణయం తీసుకుందామని మెజార్టీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరికొంత కాలం వేచిచూద్దామని కొందరు సభ్యులు అన్నారని తెలిసింది. చివరికి కష్టమైనా, నష్టమైనా అంతా మీ వెనకే ఉంటామని నేతలంతా చంద్రబాబుతో అన్నట్లు తెలిసింది.
పార్లమెంట్ వద్దకు ప్రధాని నరేంద్ర మోడి వచ్చిన సమయంలో పార్లమెంట్ ముఖద్వారం వద్ద చంద్రబాబు చేసిన నమస్కారం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిందని ఎంఎల్ఎలు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు రైతులు తమ వద్ద ఉన్న రూ.10వేలు కూడా బ్యాంకుల నుండి తీసుకోలేని పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యేలు తమ ఆవేదనను వెలిబుచ్చారు. శాసన సభ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగానికి ముఖ్యమంత్రి రేపు ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగానే మాట్లాడాలని నిర్ణయించారు.
ప్రత్యేక హోదానే టిడిపి విధానం
ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి సందిగ్ధత అవసరంలేదని ఎంఎల్ఎలు ముఖ్యమంత్రితో చంద్రబాబుతో అన్నట్లు తెలిసింది. హోదా సాధనే తమ విధానమని చంద్రబాబు నేతలకు చెప్పారు. ‘‘కేంద్ర సహకారం లేకుండా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు లేవా? కేంద్ర సహకారం లేకుండా వరుసగా గెలుస్తున్న పార్టీలు లేవా? సీఎంలు అవుతున్నవారు లేరా? మనం రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నాం. రక్షణ శాఖ నిధులతో పోలిక తెచ్చి లీకులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిందే’’ అని నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.