చీరాల : చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి చేనేత సదస్సు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యేవిధంగా చీరాలలో ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా నియోజకవర్గం మొత్తం విస్తృతంగా జనసమీకరణ చేశారు. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వమే ఏర్పాటు చేసే కార్యక్రమం కావడంతో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సభను జయప్రదం చేసేందుకు బాధ్యతలు తీసుకున్నారు. మెప్మా ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలను తరలించారు. ప్రభుత్వ పథకాలతో ప్రమేయం ఉన్న ప్రజలను, చేనేతలను పెద్ద సంఖ్యలో తరలించారు. వీరందరినీ తరలించేందుకు ప్రవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులను వినియోగించారు. దీంతో స్వచ్ఛందంగానే పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి.
నిత్యం వ్యాపారులు, కొనుగోలు దారులతో రద్దీగా ఉండే ఎంజిసి వస్ర్తవాణిజ్య సముదాయంతోపాటు పట్టణంలోని వస్ర్త దుకాణాలన్నీ స్వచ్చందంగా మూసేశారు. జనంమంతా ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సిఎం సభా స్థలానికి చేరుకున్నారు. దీంతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ బోసిపోయి కనిపించాయి. వ్యాపార సముదాయాలు సైతం మూసేయడం పట్టణంలో చర్చనీయాంశమైంది.