చీరాల : మున్సిపాలిటీలో వీధి దీపాలు వెలగకున్నా.. కుళాయిల నుంచి నీటి విడుదల సక్రమం లేకున్నా.. పురపాలనతో సంబంధమున్న మీ సమస్య యేదైనా పరిష్కారం కాకుంటే పురసేవ లేక స్వచ్ఛతా యాప్ లలో నమోదు చేసి సత్వరమే పరిష్కరించు కోవచ్చని కమీషనర్ షేక్ ఫజులుల్లా పేర్కొన్నారు. పురపాలక సిబ్బందికి స్వచ్ఛ సర్వేక్షణ్ -2019 పై అవగాహన కల్పించారు. అనుమతి లేకుండా అడ్డదిడ్డంగా భవన నిర్మాణం జరుగుతుంటే చర్యలు తప్పవన్నారు. ప్రజలు ప్రతి చిన్న పనికి మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని కోరారు. “పురాసేవ” యాప్ ను, స్వచ్ఛతా యాప్ లను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. పట్టణ ప్రాంతాల్లో పౌర సమస్యలను నిర్ధిష్ట గడువులోగా పరిష్కరించేలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు.
నగరాలు, పట్టణాల్లో పురపాలక సంఘాల నుంచి ప్రజలు సత్వర సేవలు పొందేందుకు పురసేవ యాప్ ను ప్రవేశపెట్టారన్నారు. ఈ యాప్ ద్వారా 91 రకాల సేవలను ఆన్లైన్ విధానంలో పొందవచ్చునన్నారు. యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చుని సూచించారు. ప్రజారోగ్యం, పారిశుద్యం, పరిపాలన, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలకు సంబంధించిన సేవలను, ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి చార్జీలు, బిల్డింగ్ ప్లాన్ అనుమతి, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బిపిఎస్) విభాగాల సమస్యలను ఈ యాప్ లో నమోదు చేయడం ద్వారా వేగంగ స్పందన పొందవచ్చన్నారు. ప్రజలు తమకు అవసరమైన విభాగాలు క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ఆయా విభాగాలకు సంబంధించిన సమస్యలను, ఫిర్యాదులను మున్సిపాల్టీకి ఈ యాప్ ద్వారా పంపించవచ్చన్నారు.
ముందుగా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే గ్రీవియన్స్ నెంబర్ వస్తుందని చెప్పారు. ఈ నెంబర్ ద్వారా ఫిర్యాదులు మున్సిపాల్టీ ఆన్లైన్లో నమోదవుతాయని చెప్పారు. సమస్యలు ఫొటోలు తీసి పంపవచ్చన్నారు. ఈ యాప్ ద్వారా పంపిన ఫిర్యాదులు ఏపీ మున్సిపల్ ఎంప్లాయి యాప్ కు చేరుతాయన్నారు. వీటిని సంబంధిత విభాగాల ఉద్యోగులు పరిశీలించి సమస్య పరిష్కారానికి నిర్ధిష్ట గడువులోపు పరిష్కరిస్తారని తెలిపారు. లేక పోతే ఫిర్యాదు కమిషనర్ కు వెళుతుందన్నారు. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ఉన్నత స్థాయి అధికారులకు వెళుతుందన్నారు. సరైన కారణం లేకుండా సమస్యను పరిష్కరించకపోయినా, ఫిర్యాదు స్వీకరించకపోయినా సంబంధిత ఉద్యోగుల పై చర్యలు తీసుకుంటారని వివరించారు.
అదే విధంగానే ఉన్నతాధికారులు, సీఎం కార్యాలయం డాష్ బోర్డ్ కు ఫిర్యాదులు వెళతాయని చెప్పారు. ఈ డాష్ బోర్డ్ ను ఉన్నతాధికారులు ప్రతి రోజు పర్యవేక్షిస్తుండటంతో క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలిసిపోతుందని చెప్పారు. పౌర సమస్యల పరిష్కారం విషయంలో ఈ సేవలు వాడుకోవాలని అన్నారు. తాగునీటి పైపు లైన్లు లీకేజ్, కలుషిత జలాలు సరఫరా, సక్రమంగా తాగు నీరు సరఫరా కాకపోవడం, రహదారుల మీద గోతులు, నాశిరకం పనులు, మురుగునీటి కాలువలు శుభ్రం చేయకపోవడం, చెత్తను తొలగించక పోవడం, అక్రమ కట్టడాలు, ప్రభుత్వ స్థలాలు, ఫుట్ ఫాత్ ల అక్రమణ, నిబంధనలకు విరుద్ధంగా ప్రకటన బోర్డులు, వీధి లైట్లు వెలగకపోవడం, కుక్కల బెడద, పార్కులు, క్రీడా మైదానాలు నిర్వాహణ తదితర సమస్యలను ఈ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
చేయాల్సింది ఇది…
చీరాల పురపాలక సంస్థ పరిధిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు గూగుల్ ప్లే స్టోర్ నుండి ‘పుర సేవ’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ యాప్ లోని గ్రీవెన్స్ విభాగంలోకి వెళ్లి సమస్యలను నేరుగా టైప్ చేసి పంపించవచ్చన్నారు. సమస్య ఫోటో తీసి, ఆ ప్రాంతం వివరాలు రాసి పంపిస్తే సంబంధిత ఉద్యోగి మొబైల్ కి చేరుతుందన్నారు. ఫిర్యాదుపై సంబంధిత ఉద్యోగి తీసుకున్న చర్యలను తిరిగి మళ్లీ ఫోటో ద్వారా తెలియజేయడం ఈ యాప్ ప్రత్యేకతని వివరించారు.