• వ్యవసాయ రంగాలకు రూ.53,752 కోట్లు
• గిట్టుబాటు ధరలకు ప్రభుత్వం కృషి
• హార్టికల్చర్‌కు ప్రత్యేక ప్రాధాన్యం
• బర్లీ రైతులకు రూ.275 కోట్లతో ఆదుకున్న ప్రభుత్వం
• అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
పర్చూరు (DN5 News) : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలే ప్రాణాధారమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శాసన సభలో అన్నారు. రైతు బలపడితేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలపడుతుందన్న నమ్మకంతో ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.53,752 కోట్లు కేటాయించిందని తెలిపారు. సిఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ మాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు బడ్జెట్ రూపొందించారని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.48,341 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ. 53752 కోట్లు కేటాయించి 11.2 శాతం బడ్జెట్ పెంచారని అన్నారు. ఇది అంకెల పెరుగుదల కాదని, రైతాంగంపై ప్రభుత్వానికి ఉన్న నమ్మకం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఉన్న కట్టుబాటని పేర్కొన్నారు.
రైతు సంక్షేమానికి భారీ నిధులు
రాష్ట్రంలోని 46.86 లక్షల మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ కింద ప్రతి రైతుకు రూ.20వేల చొప్పున సహాయం అందించేందుకు గతేడాది రూ.6,309 కోట్లు కేటాయించగా ఈసారి రూ.6,600 కోట్లు పొందుపరిచారని తెలిపారు. 27 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ సరఫరాకు రూ.13,700 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ధరల స్థిరీకరణ
గత రెండేళ్లలో ధరల స్థిరీకరణ నిధి ద్వారా ప్రభుత్వం రైతులను ఆదుకున్న తీరు చారిత్రాత్మకమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రూ.3వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకొని కనీసం 10 శాతం కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. రైతులు ఇబ్బంది పడ్డ పట్టించుకోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం గత బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించి, రైతుల అవసరాలకు అనుగుణంగా రూ.600 కోట్లకు పైగా వినియోగించినట్లు చెప్పారు. అరటి, మామిడి, ఉల్లి, బర్లీ పొగాకు వంటి పంటలకు మద్దతు ఇచ్చిందన్నారు.
బర్లీపొగాకు కొనుగోలు చారిత్రాత్మకం
దేశానికి విదేశీ మారకద్రవ్యం అర్జించి పెట్టే నల్లబర్లీ పొగాకు ధరలు పతనమై వ్యాపారులు కొనుగోలు చేయక ఆందోళనలో ఉన్న రైతులకు సిఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెన్ను దన్నుగా నిలిచిందని తెలిపారు. క్వింటాకు రూ.20వేలు ఉన్న ధర రూ.4వేల నుండి రూ.5వేలకు పడిపోవడంతో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని వివరించారు. ప్రభుత్వం రూ.275 కోట్లు కేటాయించి 20 మిలియన్ కిలోల పొగాకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి 30 నుండి 40 వేల చిన్న, సన్నకారు రైతులను ఆదుకుందని తెలిపారు. ‘ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే నిర్ణయం. ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యల దారికి వెళ్లకుండా అడ్డుకట్ట వేసిన చర్య’ అని పేర్కొన్నారు.
మైక్రో ఇరిగేషన్‌కు ప్రాధాన్యం
30 ఏళ్ల క్రితం సిఎం చంద్రబాబు మైక్రో ఇరిగేషన్ కాన్సెప్ట్‌ను కుప్పంలో మొట్ట మొదటిసారిగా ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. తరువాత టాస్క్ ఫోర్స్ చైర్మన్‌గా దేశ వ్యాప్తంగా మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యతను విస్తృతంగా ప్రచారం చేశారని గుర్తు చేశారు. విద్యుత్ 35శాతం ఆదా, ఎరువులు 40శాతం ఆదా, శ్రమ 35శాతం ఆదా, దిగుబడి 30–60శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొన్నారు. రూ.800 కోట్లు ఖర్చు చేసి 1 లక్ష హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ అమలు చేస్తే 7ఏళ్లలో రూ.8వేల కోట్ల అదనపు ఆదాయం సాధ్యమని గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు.
ఆయిల్‌పామ్ విస్తరణ
రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.49 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్‌పామ్‌ను బాపట్ల, మార్టూరు, అద్దంకి, కొండేపి ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
సిబ్బంది కొరతపై విజ్ఞప్తి
హార్టికల్చర్ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, అగ్రికల్చర్ అధికారులతో పోలిస్తే ఆర్టికల్చర్ అధికారులు తక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. హార్టికల్చర్ అధికారుల నియామకాలు చేపట్టాలని కోరారు. స్వర్ణ గ్రామాలలో పనిచేస్తున్న హార్టికల్చర్ అసిస్టెంట్స్‌ను పూర్తిస్థాయిలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్‌కు కేటాయించేలా చూడాలని అన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు.
రైతు ఓటు బ్యాంకు కాదు
ప్రభుత్వం రైతాంగాన్ని ఓటు బ్యాంకుగా కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా చూస్తోందని అన్నారు. అందుకే అంకెలకే పరిమితం కాకుండా భావాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వ్యవసాయం, హార్టికల్చర్, అనుబంధ రంగాల సమగ్ర అభివృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.






