చీరాల : ఓవర్ బ్రిడ్జి చివర విఠల్‌నగర్‌వైపు ఉన్న మున్సిపల్ స్థలం వద్ద శుక్రవారం వివాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ స్థలాన్ని ఎవ్వరూ ఆక్రమించవద్దంటూ అధికారులు హెచ్చరికల బోర్డు ఏర్పాటు చేశారు. అదే స్థలానికి చుట్టూ ప్రహరి నిర్మించేందుకు టెండర్లు ఆమోదించారు. పనులు చేసేందుకు వెళ్లిన కాంట్రాక్టర్ వెల్లడంతో అంతకుముందు ఆస్థలంలో నివాసం ఉన్న ఎస్‌సి సామాజికవర్గానికి చెందిన బాధితులు అడ్డుకున్నారు. తమకు ప్రత్యామ్నయం చూపకుండా తమను బలవంతంగా ఖాళీ చేయించారని, తమకు ప్రత్యామ్నయం చూపేవరకు పనులు చేయడానికి లేదని అడ్డుకున్నారు. దీంతో కాంట్రాక్టర్, బాధితులకు మద్య వివాదం చోటు చేసుకుంది. ప్రహరీ నిర్మాణానికి తీసుకొచ్చిన రాళ్లను కూడా దించనివ్వకుండా బాధితులు అడ్డుపడ్డారు. అయినప్పటికీ బలవంతంగానే రాళ్లు దింపారు. ఇసుక దింపేందుకు కూడా బాధితుడు అడ్డుకున్నారు. దీంతో ఇసుకరోడ్డుపైనే దింపే ప్రయత్నం చేయడంతో దింపడానికి లేదని బాధితుడు రోడ్డపై పడుకున్నప్పటికీ ట్రాక్టర్ ఇసుకను అతనిపైనే కార్చేశారు.
అసలు వివాదమేంటీ….
పదేళ్ల క్రితం కామధేను కాప్లెక్ వెనుకవైపు రోడ్డులో అంటే ప్రస్తుతం ఎల్ఐసి పక్కనున్న కాంప్లెక్ నుండి ఎంజిసి మార్కెట్‌వైపుకు వెళ్లే రహదారిని ఆక్రమించుకుని గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలు అప్పట్లో అక్కడ సిమెంటు నిర్మాణానికి అడ్డంగా ఉండటంతో అప్పటి మున్సిపల్ అధికారులు ఖాళీ చేయించారు. అప్పట్లో తమకు ప్రత్యామ్నయం చూపాలని ఆందోళన చేయడంతో ఆర్ఒబి కింద చెత్తడంపింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో తాత్కాలికంగా ఇళ్లు వేసుకునేందుకు అనుమతించారు. అప్పటి నుండి ఎస్‌సి సామాజికవర్గానికి చెందిన పేదలు అక్కడే నివాసం ఉంటున్నారు.
అయితే ఇటీవల మున్సిపల్ అధికారులు మున్సిపల్ స్థలాలను స్వాదీనం చేసుకుని పారిశుద్యం పనులకు ఉపయోగించుకునేందుకు కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. ఆయా స్థలాలకు ప్రహరీలు నిర్మించేందుకు నిధులు కేటాయిస్తూ టెండర్లు పిలిచారు. టెండర్లు ఆమోదించి పనులు చేయాలని ఆదేశించారు. స్థలంలో నివాసం ఉంటున్న బాధితుడు విద్యుత్ షార్ట్‌సర్య్యూట్‌తో దగ్దం కావడంతో ఆప్రాంతం ఖాళీ చేసి వెళ్లడంతో ఐదు నెలలుగా ఖాళీగా ఉంది. స్థలం మున్సిపాలిటీకి చెందినదని, ఎవ్వరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. తాజాగా గోతాల శ్రీనివాసరావు అనే వ్యక్తి తాను 20ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నానని, తన స్థలంలో వ్యర్ధాల సేకరణ ప్రదేశంగా ఎలా నిర్మిస్తారని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని బాధితుడిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.