కందుకూరు : యువతే దేశానికైనా, రాష్ట్రానికైనా, కుటుంబానికైనా వెన్నెముక వంటి వారని, వారికి ఉపాధి అవకాశాలు చూపితేనే అభివృద్ది సాధ్యమని టిడిపి శిక్షణా శిభిరం డైరెక్టర్, కందుకూరు జెడ్‌పిటిసి కంచర్ల శ్రీకాంత్‌ఛౌదరి పేర్కొన్నారు. టిడిపి సేవామిత్ర 31వ బ్యాచ్ శిక్షణ శిబిరం ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగులైన యువతకు ఆర్దిక, నైపుణ్య చేయూతనిచ్చేందుకే యువనేస్తం కార్యక్రమం రూపొందించారని పేర్కొన్నారు. ప్రదాన ఉద్దేశ్యం ఉపాది శిక్షణ, స్వయం ఉపాది కల్పన అన్నారు.
కొన్ని రాష్ట్రాలు గరిష్టంగా 20 వేల మందికి మాత్రమే భ్రుతి ఇవ్వటానికి ప్రయత్నించి విపలం అయ్యాయని పేర్కొన్నారు. కానీ ఆర్ధిక లోటుతో ఉన్న రాష్ట్రమైనప్పటికీ ఇచిన హామీలకు కట్టుబడే అర్హులైన 10లక్షలకుపైగా ఉన్న నిరుద్యోగ యువతకు ఈ పథకం అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. యువనేస్తం రూ.వెయ్యి భ్రుతి ఇచ్చి చేతులు దులుపుకొనే కార్యక్రమం కాదన్నారు. యువతను సరైన మార్గంలో నడిపించాలనే సదుద్దేశ్యంతో ఐటి శాఖ మంత్రివర్యులు లోకేష్ అనేక శాఖల అనుసంధానంతో పూర్తి స్థాయి ఆన్లైన్ వేదికను సిద్దం చేసారని తెలిపారు. యువనేస్తం జాతీయ స్థాయిలో ఆదర్శం కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో శిక్షణ శిభిరం శిక్షకులు కాకర్ల మల్లిఖార్జున్, యర్రా సాంబశివరావు, ఉరుకుంద కో-ఆర్డినేటర్ పోకూరి రాంబాబు, కొల్లి అవినాష్, సాదినేని వినయ్ పాల్గొన్నారు.