Home జాతీయం తెలుగుదేశం మహానాడు ప్రారంభం

తెలుగుదేశం మహానాడు ప్రారంభం

425
0

విజయవాడ:  తెలుగుదేశం పండుగ ‘మహానాడు’ అట్టహాసంగా ప్రారంభమైంది. టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పండుగను ప్రారంభించారు. తొలుత మహానాడు ప్రాంగణానికి వచ్చిన చంద్రబాబు డ్వాక్రా బజార్‌, ఫోటో ప్రదర్శన తిలకించారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాతలను అభినందించారు. విజయవాడలోని కానూరు వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రాంగణంలో పసుపు పండుగ ఆదివారం నుంచి మూడురోజుల పాటు జరగనుంది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అభివృద్ధి నిధుల కేటాయింపు కోసం కేంద్రంపై తన పోరాట పంథాను మరింత స్పష్టంగా పార్టీ శ్రేణులకు, ప్రజలకు వివరించేందుకు టిడిపి మహానాడును వేదికగా చేసుకోనుంది. ఈ మహానాడు నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. రానున్న సంవత్సరకాలంలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలపైనే నాలుగు తీర్మానాలు..!

మహానాడులో 36 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. వీటిలో కేంద్రం వైఖరిని ఖండించేందుకే నాలుగు తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయం, క్షీణిస్తున్న కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న తీరు, పెరుగుతున్న కేంద్ర పెత్తనం, రాష్ట్రాల ఆర్థిక పరిపుష్ఠిని దెబ్బతీసేలా 15వ ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం ‘టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌’ ఇవ్వడం వంటి అంశాలపై తీవ్ర స్థాయిలో మహానాడులో ధ్వజమెత్తనున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కి నివాళి, కేంద్ర రాజకీయాల్లో టిడిపి పాత్ర వంటి అంశాలన్నీ వీటిలో ప్రస్తావిస్తారు. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 20, తెలంగాణకు సంబంధించి 8 తీర్మానాలు ఉంటాయి.