Home బాపట్ల స్వర్ణ గ్రామ డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి

స్వర్ణ గ్రామ డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి

15
0

• యుటిల్లో పూడిక తీసి సామర్ధ్యం పెంచాలి
• కాలువల్లో పూడిక తీయించాలి
• వరదనీటి పారుదల కల్పించాలి
• రైతు సదస్సులో నేతల డిమాండ్‌
కారంచేడు (DN5 News) : డ్రైనేజీ, వరద ముంపు సమస్య పరిష్కరించాలని కోరుతూ కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో రైతు సదస్సు మంగళవారం నిర్వహించారు. దీర్ఘకాలంగా రైతులను వేధిస్తున్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతు సంఘం ఉపాధ్యక్షులు సిహెచ్‌ గంగయ్య కోరారు. సమస్యను ప్రభుత్వ సహకారంతో ఉమ్మడిగా పరిష్కారం చేసుకోవాలని అన్నారు. గతేడాది మొంథ తుఫానుకు స్వర్ణ గ్రామ రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. గ్రామానికి రెండు రోజులు రాకపోకలు స్తంభించాయని అన్నారు. పొలాల్లో నీరు రోజుల తరబడి వరద నీళ్లు నిలిచాయి. దీంతో రూ.వేలల్లో ఖర్చుపెట్టి, చాకిరీ చేసి వేసిన వరి నాట్లు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఎక్కువ మంది రైతులు మరల నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్టిన పెట్టుబడి, చేసిన చాకిరీ వరద నీటిపాలైంది. ప్రభుత్వం ఇస్తామన్న పంట నష్ట పరహారం నేటికీ రానేలేదు. ఇలా నష్టపోవడం ఇది తొలిసారి కాదు. గత మూడేళ్లు, అంతకు ముందు అడపాదడపా ఇదే పరిస్థితి. ఇలాంటి నష్టాల నుండి రైతులకు, గ్రామ ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

– కొమ్మమూరు కాలువకు పడమర వైపు ఉన్న పులక్కాలవ వరద నీళ్లు కారంచేడు నుండి స్వర్ణ గ్రామ స్మశానం వరకు వచ్చి అక్కడి నుండి యుటి గుండా బయటికి పోవాలి
– గ్రామం ఉత్తరం వైపున ఎగువ ప్రాంతం నుండి వచ్చే పులక వరద స్మశానం వరకు వచ్చి అక్కడి నుండి యుటి వరకు వెళ్లాలి
– తిమిత్తిపాడు వైపు నుండి వచ్చే వరద నీరు కప్పల వాగు ద్వారా యుటి గుండా బయటికి వెళ్లాలి
ఈ మూడు ప్రధాన కాలువల సమస్య పరిష్కారం చేయాలని కోరారు. కాలువల్లో పూడిక తీస్తే నీరు ఆగకుండా వెళ్లడం ద్వారా వరద సమస్య కొంతవరకు పరిష్కారం చేయవచ్చని అన్నారు. కానీ 7 8ఏళ్లుగా ఇందుకు ఒక పైసా కూడా ప్రభుత్వాలు ఖర్చు చేయలేదని అన్నారు. కాలువలు, వాగులు పూడిపోయాయని అన్నారు. తక్షణం ప్రభుత్వం పూనుకొని వీటి మరమ్మత్తులు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. యూటిలను ఆధునికరించాలని అన్నారు. యుటిల్లో నీటి సామర్ధ్యం పెంచే విధంగా కానాలు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం ఉన్న యుటి కానాలు సాధారణ వర్షాల నీటి కూడా బయటికి పంపే స్థితిలో లేవని, మొంథా తుఫాను వంటి అసాదారణ నీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని యుటిల కానాల సంఖ్య పెంచాలని కోరారు.

‘కోటప్పకొండపై చెంబెడు నీళ్ళు పోస్తే ఈ ప్రాంతం కొట్టుకుపోతుంది’ అనేది పూర్వం నుండి ఉన్న నానుడి అన్నారు. అంటే ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద నీరు అంతా మన ప్రాంతానికి వచ్చి చేరుతుందని అన్నారు. ఇంకొల్లు, దగ్గుబాడు, పూసపాడు ప్రాంతాలలో నక్కల వాగు, కప్పల వాగు, తదితరవాగులన్నీ మన ప్రాంతం గుండా ఉప్పుటూరు వాగులో కలుస్తాయని అన్నారు. పర్చూరు రోడ్డుకు కొమ్మమూరు కాల్వ స్వర్ణ వరకు వచ్చే నీరంతా ఎటు వెళ్లాలని ప్రశ్నించారు? ఇప్పటి వరకు నీటి ప్రవాహం జరుగుతున్న కాలువలకు అడ్డుగా ప్రస్తుతం జాతీయ రహదారి నిర్మాణం జరిగిందని అన్నారు. జాతీయ రహదారికి బ్రిడ్జి కట్టిన చోట నక్కలవాగు కూడా వెళ్లాల్సి ఉందని, మిగతా నీరంతా స్వర్ణ యూటీ గుండా వెళ్లాల్సి ఉందని అన్నారు. యూటిలు ఆధునీకరించి సామర్ధ్యం పెంచకపోతే పెద్ద మొత్తంలో వచ్చే వరద నీళ్లు వెళ్లే మార్గం లేక గ్రామం చుట్టూ వరద చేరి మరింత నష్టం కలిగిస్తుందని అన్నారు.

భౌగోళికంగా చీరాల వాద, కారంచేడు ప్రాంతం తొట్టి అని పేరు. (పల్లపు ప్రాంతం) పర్చూరు, మార్టూరు, ఇడుపులపాడు, దగ్గుబాడు తదితర ఎగువ ప్రాంతాల వర్షపు వరద నీరు నక్కల వాగు, కప్పల వాగు, చిన్నా చితక కాలవల గుండా స్వర్ణ వైపే రావాల్సి ఉందిన అన్నారు. పర్చూరు, నూతలపాడు, ఆదిపూడి వైపు నుంచి వచ్చే వర్షపు నీరు నక్కల వాగు వద్ద మాత్రమే ఉప్పుటూరు వాగుకు వెళతాయని, తీవ్రమైన వరద వస్తే ఉప్పుటూరు వాగు ఎదురుతన్ని స్వర్ణ పొలాలను వరద ముంచెత్తే ప్రమాదం ఉందని అన్నారు. అధిక వర్షాలకు వచ్చే వరద నీళ్లు వెళ్లడానికి కారంచేడు యుటిలు సరిపోక ఉప్పుట్టూరు వాగు ఎగతట్టే ప్రమాదం ఉందని అన్నారు. ఉప్పుటూరు వాగు ప్రవాహ ఉధృతిని దృష్టిలో పెట్టుకొని లెఫ్ట్ ఆర్మ్‌, రైట్‌ ఆర్మ్‌లకు 1970లో నిపుణుల కమిటీ సూచనల మేరకు 74లో ఈపురుపాలెం స్ట్రైట్‌కట్‌, వేటపాలెం స్ట్రైట్‌కట్‌ కాలువలు తవ్వి వరద నీరు సముద్రంలో కలిసే ఏర్పాటు చేశారని అన్నారు.

1990లో వచ్చిన వరద తాకిడికి ఈ రెండు స్ట్రైట్ కట్లు కూడా వరద తీయలేకపోవడంతో మరో స్ట్రైట్‌కట్‌ తవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు అప్పట్లో ప్రభుత్వానికి సూచించారని గుర్తు చేశారు. చీరాల వాద పొలాలు ప్రతి ఏటా నవంబర్ తర్వాత నాట్లు వేస్తారని అన్నారు. కొత్తగా వేసిన పిడుగురాళ్ల హైవేకు రెండు వైపుల పొలాలు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఈ ఏడాది తీవ్రంగా పంటలు దెబ్బ తినడం చూశామని అన్నారు. కుంకలమర్రు, బోయినవారిపాలెం, కారంచేడు, స్వర్ణ, చీరాల వాద పొలాలు తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు. ఈ ప్రాంతాన్ని వరదల నుండి విముక్తి చేయాలంటే డ్రైన్లు పూడిక తీసి, యుటిల సామర్ధ్యం పెంచి మరో స్ట్రైట్‌కట్‌ తవ్వించాల్సిన అవసరం ఉందని అన్నారు. రొంపేరు కుడి, ఎడమల కాలువల్లో తూటి కాడ తొలగించి పూడిక తీయించి వరద నీళ్లు నేరుగా వేగంగా సముద్రంలో కలిసే విధంగా అభివృద్ది చేయాలని అన్నారు. కాలువల ఆధునీకరణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. మన ప్రాంత ప్రజాప్రతినిధులు, రైతులు, రైతు సంఘాలు పూనుకొని నిధులు సాధించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కందిమళ్ల రామకోటేశ్వరరావు, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి పి కొండయ్య, ఎం వసంతరావు, పిఎసిఎస్‌ నాయకులు పాల్గొన్నారు.