Home జాతీయం సుప్రీం తీర్పుతో బీజేపీకి షాక్… రంగంలోకి దిగిన మోడీ… దేవెగౌడతో మంతనాలు

సుప్రీం తీర్పుతో బీజేపీకి షాక్… రంగంలోకి దిగిన మోడీ… దేవెగౌడతో మంతనాలు

396
0

ఢిల్లీ : సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైంది. బల నిరూపణకు గవర్నర్ ఇచ్చిన 15 ర్పజుల గడువుకు సుప్రీంకోర్టు గండి కొట్టింది. 15రోజుల గడువు లోపు ఎలాగైనా ఎమ్యెల్యేలను లోబరుచుకోవచ్చన్న బిజెపి నేతలు ఆశలు ఆవిరయ్యాయి. ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందామన్న బీజేపీ అసలు వమ్ము కావడంతో దిగ్భ్రాంతికి గురయ్యారని సమాచారం. ఎలాగైనా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలన్న ఆశతో బీజేపీ నేతలు తమ ప్రలోభ పర్వాన్నీ వేగవంతం చేసినట్లు సమాచారం. ఇక కర్ణాటక నేతలు… అక్కడికి పంపిన పరిశీలకుల మీద నమ్మకం లేక ప్రధాని స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ పుట్టిన రోజును అవకాశంగా తీసుకున్న మోడీ నేరుగా ఆయనకు ఫోన్ చేశారు. పుట్టిన రోజు సందర్భంగా మాజీ ప్రధాని దేవెగౌడ శుక్రవారం ఉదయం తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఉన్న సమయంలో దేవెగౌడకు ప్రధాని మోడీ ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ఫోన్‌ చేసిన విషయాన్ని దేవెగౌడ తనయుడు రేవణ్ణ ధృవీకరించారు.

మోడీ ఫోన్ వెనుక శుభాకాంక్షలు చెప్పడం తోపాటు ఆయన్ని బుజ్జగించడం కూడా ప్రధాని ఉద్దేశమని ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలో బల పరీక్షకు ఒక్క రోజు మాత్రమే గడువు వుండడంతో బీజేపీకి మద్దతు కూడగట్టే పనిలోనే దేవెగౌడకు శుభాకాంక్షల ఎత్తు వేశారని పరిశీలకులు చెబుతున్నారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. శనివారమే యడ్యూరప్ప ప్రభుత్వం బల పరీక్ష శాసనసభలో జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై బీజేపీ నేత, ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాట్లాడుతూ తన ప్రభుత్వం కచ్చితంగా విశ్వాస పరీక్షలో నెగ్గుతుందని చెప్పారు. బల పరీక్షకు తాము సిద్ధమేనన్నారు. తన ప్రభుత్వాన్ని బలపరచేందుకు తగిన ఎమ్మెల్యేల బలం తనకు ఉందన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. తన ప్రభుత్వానికి ఆధిక్యత ఉన్నట్లు రుజువు చేసుకుంటానన్నారు. ఇక విశ్వాస పరీక్షలో తామే నెగ్గుతామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక కారణాలో ఆ పార్టీకి చెందిన అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఈ నెల 12న జరిగిన ఎన్నికల్లో 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీకి 104 స్థానాలు లభించాయి. కాంగ్రెస్ (78), జేడీఎస్ (38) చేతులు కలిపాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే 112 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే తమకు 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. తమకు 8గురు కాంగ్రెస్, ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారని తెలిపాయి. విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప ప్రభుత్వానికి అనుకూలంగా మొత్తం 116 మంది ఓటు వేస్తారని తెలిపాయి.

శుక్రవారం కాంగ్రెస్, జేడీఎస్ దాఖలు చేసిన పిటిషను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం రెండు ప్రత్యామ్నాయాలను సూచించినట్లు తెలుస్తోంది. 24 గంటల్లో శాసనసభలో బల పరీక్ష , ప్రభుత్వ ఏర్పాటుపై సుదీర్ఘ విచారణ … ఈ రెండిటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలని కాంగ్రెస్, జేడీఎస్‌లకు సుప్రీంకోర్టు సూచించింది.. ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు పార్టీలు పొత్తు పెట్టుకున్నట్లు ప్రజలకు తెలియదు కదా? అని కాంగ్రెస్, జేడీఎస్‌లను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ రెండు ప్రయత్నామ్నాయాల్లో ఏదో ఒక దానిని ఎంచుకోవాలని కాంగ్రెస్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వికి సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై సింఘ్వి స్పందిస్తూ శనివారం (రేపు) బల పరీక్షకు అంగీకరిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించినట్లు సమాచారం.