Home ఆంధ్రప్రదేశ్ తీరంలో అల‌ల ఉదృతి

తీరంలో అల‌ల ఉదృతి

353
0

– ముంచుకొస్తున్న ప్ర‌చండ అల‌లు
– ఏపీ, ఒడిశా, పశ్చిమ్‌బంగాకు ఇన్‌కాయిస్‌ హెచ్చరికలు
– తీరంలో రెండు రోజులు సముద్ర స్నానాలు నిలిపివేయాలి
– వేట‌కెళ్ల‌వ‌ద్ద‌ని మ‌త్య్స‌కారుల‌కు హెచ్చ‌రిక‌లు

చెన్నై, హైద‌రాబాద్ : వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు మారుతున్నాయి. భ‌యంక‌ర‌మైన‌, ప్రచండ గాలుల కారణంగా భారత తూర్పు తీరంలోని సముద్రంలో భారీ అలలు ఎగసి పడే ప్రమాదం ఉంది. ఈ మేర‌కు సునామీ హెచ్చరికల సంస్థ (ఇన్ కాయిస్) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 24 నుండి 26 తేదీ వరకూ సముద్రంలో భారీగా అలలు ఎగసి పడే సూచనలు ఉన్నాయని హెచ్చ‌రించింది. భారత తూర్పు తీరంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్‌బంగా తీర ప్రాంతాల్లోని సముద్రం అల్లకల్లోలంగా మారిందని ఇన్ కాయిస్ హెచ్చరికలు జారీ చేసింది.

ప్రస్తుతం అండమాన్ వైపు నుండి భారత ప్రధాన భూభాగం తీరం వైపునకు ప్రచండ అలలు దూసుకువస్తున్నాయని ఇన్‌కాయిస్ చెప్పింది. అలలు దాదాపుగా 3-4 మీటర్ల ఎత్తున ఉండే అవకాశముందని స్పష్టం చెప్పారు. అల‌లె తీరానికి చేరుకునే సమయంలో మరింత ఉద్ధృతంగా ఉంటాయని సూచించింది. బలమైన అలలు హఠాత్తుగా ఎగసిపడతాయని. తీరప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రత్యేకించి తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు అలలు చొచ్చుకువచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. సముద్ర తీరానికి దగ్గరగా నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చ‌రించారు. ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు ఉన్న రెండు రోజుల పాటు సముద్ర స్నానాలు నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని తీరప్రాంత జిల్లాల యంత్రాంగానికి హెచ్చరికలతో కూడిన సూచనలు ఇచ్చింది. అదే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అందుకే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చూడాలని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు ఒడిశా, పశ్చిమ్‌బంగా‌పై అలల ఉద్ధృతి ఎక్కువ ప్రభావం చూపించే అవకాశముంది. ఆఫ్రికా సమీపంలో ప్రచండమైన గాలుల తీవ్రత కారణంగా సముద్రంలో భారీ అలలు ఏర్పడ్డాయని వివ‌రించింది. ఇప్పటికే అలలు పశ్చిమ తీరంలోని చాలా ప్రాంతాలను తాకాయని ఇన్ కాయిస్ వెల్లడించింది. అరేబియా సముద్రంలోని ఆయా ప్రాంతాల్లో 4-5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయని స్పష్టం చేసింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తీరాల్లో పలు లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకువచ్చింది. కేరళలో వందకు పైగా ఇళ్లు సముద్రపు అలలు కారణంగా ధ్వంసమయ్యాయంటే అల‌ల తాకిడి ఎలా ఉంటుందో ప్ర‌జ‌లు గ‌మ‌నించాలి.